LOADING...
Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. నిఫ్టీ @25,000 
లాభాల్లో ముగిసిన సూచీలు.. నిఫ్టీ @25,000

Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. నిఫ్టీ @25,000 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతో ముగిశాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) కీలక వడ్డీ రేట్లపై ప్రకటించిన నిర్ణయం తర్వాత సూచీల్లో ఉత్సాహం కనిపించింది. రోజు ప్రారంభంలో మార్కెట్లు స్థిరంగా (ఫ్లాట్‌గా) ప్రారంభమైనప్పటికీ, ఆర్‌బీఐ వడ్డీ రేట్లను సవరించిన అనంతరం సూచీలు జోరు పుంజుకున్నాయి. గత ఫిబ్రవరి,ఏప్రిల్ నెలల్లో వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గిన నేపథ్యంలో,ఈసారి రిజర్వ్ బ్యాంక్ ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ ప్రకటనకు ముందు నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు, ఆ తర్వాత మూడ్ మార్చుకుని లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా బ్యాంకింగ్,ఆటోమొబైల్,రియల్ ఎస్టేట్ రంగాల షేర్లు బాగా రాణించాయి.

వివరాలు 

 నిఫ్టీ @25,000 

ఒక దశలో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా ఎగిసింది, అలాగే నిఫ్టీ 25,000 పాయింట్లకు పైగా నిలిచింది. ఈరోజు సెన్సెక్స్ ఉదయం 81,434.24 పాయింట్ల వద్ద ప్రారంభమైంది,ఇది గత ముగింపు స్థాయైన 81,442.04తో పోల్చితే అతి స్వల్ప తేడాతో ఫ్లాట్‌గా ఉందని చెప్పవచ్చు. ఆర్‌బీఐ నిర్ణయం ప్రకటించబోయే ముందు సూచీ కొంతకాలం నష్టాల్లో ట్రేడయింది. కానీ ఆ తర్వాత గణనీయంగా లాభాల బాట పట్టి,ఇంట్రాడే గరిష్ఠంగా 82,299.89 పాయింట్లను తాకింది. చివరికి 746 పాయింట్ల లాభంతో 82,188.99 వద్ద ముగిసింది.ఇదే విధంగా నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 25,029 వద్ద గరిష్ఠ స్థాయికి చేరింది,చివరకు 252 పాయింట్ల లాభంతో 25,003 వద్ద ట్రేడింగ్ ముగించింది.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 65.06 డాలర్లు 

సెన్సెక్స్‌లోని 30 ప్రధాన షేర్లలో బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎటర్నల్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం), కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడగా, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా మాత్రమే నష్టాల్లో ముగిశాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 65.06 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు ధర 3,379 డాలర్ల వద్ద కొనసాగుతోంది.