Reliance: రోస్‌నెఫ్ట్‌తో రిలయన్స్ 10 సంవత్సరాల ఒప్పందం.. ఏటా రూ.1.1 లక్షల కోట్ల విలువైన ముడిచమురు 10 ఏళ్ల పాటు దిగుమతి
రిలయన్స్ ఇండస్ట్రీస్, రష్యా ప్రభుత్వ రంగ చమురు సంస్థ రాస్‌నెఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం రోజుకు 5 లక్షల బ్యారెళ్ల చమురును (ఏడాదికి 25 మిలియన్ టన్నులు) పదేళ్ల పాటు సరఫరా చేయనుంది. ఇది ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు కుదిరిన అతిపెద్ద ఇంధన ఒప్పందంగా నిలిచింది.
రష్యాతో బంధం మరింత బలోపేతం
2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైన తర్వాత, ఐరోపా దేశాలు రష్యా చమురు కొనుగోళ్లు తగ్గించాయి. ఫలితంగా, రష్యా తక్కువ ధరకు (బ్యారెల్‌కు 3-4 డాలర్లు తక్కువగా) చమురు అందించడం ప్రారంభించింది, దీనిని భారత్ సద్వినియోగం చేసుకుంది. ఆ సమయంలో భారత మొత్తం చమురు కొనుగోళ్లలో రష్యా వాటా 1% లోపే ఉండగా, ఆ ఘటన తర్వాత ఇది దాదాపు 40%కి పెరిగింది. రష్యా నుంచి చమురు తీసుకొనే దేశాల్లో భారత్ రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచింది. తాజా ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. 2023 అక్టోబర్ నెలలో, రష్యా చమురు ఎగుమతుల్లో 47% చైనా కొనుగోలు చేస్తే, 37%తో భారత్ రెండో స్థానంలో నిలిచింది.
ఏటా 12-13 బిలియన్ డాలర్ల చమురు
రిలయన్స్ ఇండస్ట్రీస్ 10 ఏళ్ల ఒప్పందం కింద, అంతర్జాతీయ చమురు సరఫరాలో 0.5% వాటా కలిగిన ముడి చమురును దిగుమతి చేసుకోనుంది. ప్రస్తుత ధరల ప్రకారం, దీని విలువ ఏడాదికి 12-13 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.02-1.1 లక్షల కోట్లు) అవుతుంది. ఈ ఒప్పందం, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన అనంతరం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పరిష్కారంపై చర్చల నడుమ కుదరకపోవడం గమనార్హం. ఇది భారత్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటనకు ముందే జరగడం విశేషం.
సరఫరా విధానం
ఒప్పందం ప్రకారం, 20-21 ఆఫ్రామాక్స్ పరిమాణం (80,000-1,00,000 మెట్రిక్ టన్నులు) కలిగిన కార్గోల్లో రాస్‌నెఫ్ట్ వివిధ గ్రేడ్‌ల చమురును సరఫరా చేస్తుంది. ప్రతి నెల మూడు లక్ష టన్నుల చమురు కార్గోలను అందిస్తారు. ఇప్పటికే ఉన్న ఒప్పందాలు 2023లో రిలయన్స్ నెలకు 30 లక్షల బారెళ్ల చమురు రాస్‌నెఫ్ట్‌తో ఒప్పందం ద్వారా దిగుమతి చేసింది. జనవరి-అక్టోబర్ మధ్య రోజుకు 4,05,000 బారెళ్ల చమురును దిగుమతి చేసుకోగా, 2023లో ఇదే కాలంలో రోజుకు 3,88,500 బారెళ్ల మేర చమురు తీసుకుంది. కొత్త ఒప్పందం ప్రకారం, జనవరి నుంచి ఈ సరఫరా 10 ఏళ్ల పాటు కొనసాగుతుందని, అవసరమైతే మరో 10 ఏళ్లకు పొడిగించే అవకాశం ఉందని సమాచారం.
జామ్‌నగర్ రిఫైనరీలు
జామ్‌నగర్‌లో రిలయన్స్‌కు రెండు రిఫైనరీలు ఉన్నాయి. ఒక్కటి రోజుకు 5,80,000 బారెళ్ల ఉత్పత్తిని పూర్తిగా ఎగుమతి చేస్తుండగా, మరొకటి రోజుకు 6,60,000 బారెళ్ల చమురును దేశీయ అవసరాల కోసం వినియోగిస్తుంది.