Nord Stream: నార్డ్‌స్ట్రీమ్‌పై అమెరికా కన్ను? రష్యా ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ సంచలన ఆరోపణలు చేశారు. నార్డ్‌స్ట్రీమ్ గ్యాస్ పైప్‌లైన్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై ఆధిపత్యం సాధించాలన్న లక్ష్యంతో అమెరికా ముందుకు సాగుతోందని లావ్రోవ్ ఆరోపించారు. ఇందులో భాగంగా ఐరోపా దేశాలకు గ్యాస్ సరఫరా చేసే నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్‌లను తమ ఆధీనంలోకి తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు. అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి ఆయన ఎలాంటి ప్రత్యక్ష ఆధారాలు సమర్పించలేదు. ఇదిలా ఉండగా, అమెరికాకు చెందిన ఓ ఇన్వెస్టర్ ఈ పైప్‌లైన్‌ను కొనుగోలు చేయాలని ప్రయత్నించినట్లు 2024లో వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది.
వివరాలు
ఐరోపాకు కీలకమైన నార్డ్‌స్ట్రీమ్
ఐరోపా ఖండానికి ముఖ్యంగా శీతాకాలంలో రష్యా నుంచి సహజ వాయువు సరఫరా చేయడంలో నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్ కీలక పాత్ర పోషిస్తుంది. బాల్టిక్ సముద్రం గుండా జర్మనీకి గ్యాస్ చేరేలా నార్డ్‌స్ట్రీమ్-1, నార్డ్‌స్ట్రీమ్-2 పైప్‌లైన్‌లు నిర్మించారు. అయితే, 2022లో ఈ పైప్‌లైన్‌లలో పలు లీకేజీలు చోటుచేసుకున్నాయి. ఈ లీకేజీలకు పేలుళ్లే కారణమని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై సంబంధిత దేశాలు దర్యాప్తు చేపట్టినా, ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు బయటపడలేదు. ఈ నేపథ్యంలో గతేడాది ఇటలీలో ఓ ఉక్రెయిన్ పౌరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే సమయంలో, ఈ విధ్వంసానికి అమెరికా కూడా కారణమై ఉండొచ్చని రష్యా ఇప్పటికే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.