
Digilocker: ఈక్విటీ ఇన్వెస్టర్లకు అదిరే శుభవార్త చెప్పిన సెబీ.. ఏప్రిల్ 1 నుంచి కొత్త సేవలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వం డిజిటల్ విధానంలో ప్రజల డాక్యుమెంట్లను భద్రంగా నిల్వ చేసేందుకు డిజిలాకర్ సేవలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ఆధార్ వివరాలతో నమోదు చేసుకొని, వ్యక్తిగత డాక్యుమెంట్లను భద్రపరచుకునే అవకాశం ఇందులో ఉంది.
ఇప్పుడు ఈ డిజిలాకర్ సేవలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు.
స్టాక్ మార్కెట్, ఈక్విటీ ఇన్వెస్టర్ల కోసం డిజిలాకర్ సేవలను అందించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) చర్యలు చేపట్టింది.
ఇన్వెస్టర్లు తమ షేర్లు, మ్యూచువల్ ఫండ్ల వివరాలను డిజిలాకర్‌లో భద్రపరచుకోవచ్చు. ఈ సేవలు ఏప్రిల్ 1, 2025 నుండి అందుబాటులోకి రానున్నాయి.
వివరాలు
ఏకీకృత ఖాతా స్టేట్‌మెంట్‌లను కూడా పొందే అవకాశం
దేశీయ సెక్యూరిటీస్ మార్కెట్‌లో క్లెయిమ్ చేయని సెక్యూరిటీలను తగ్గించడానికి, ఇన్వెస్టర్ల పెట్టుబడులకు మరింత భద్రత కల్పించేందుకు సెబీ డిజిలాకర్‌తో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం డిజిలాకర్ వినియోగదారులు తమ డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లు, మ్యూచువల్ ఫండ్ల యూనిట్ల వివరాలను పొందటంతో పాటు వాటిని భద్రపరచుకోవచ్చు.
అలాగే, ఏకీకృత ఖాతా స్టేట్‌మెంట్‌లను కూడా పొందే అవకాశాన్ని కల్పించనున్నారు.
డిజిలాకర్ అకౌంట్లకు నామినీ పేర్లను చేర్చుకునే విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
దీని వల్ల ఇన్వెస్టర్ల డాక్యుమెంట్లను నామినీలు సులభంగా పరిశీలించుకునే అవకాశం ఉంటుంది.
వివరాలు
ఈ సేవల ద్వారా.. నామినీలు సులభంగా షేర్లు, ఫండ్లను పొందే వీలు
ఒకవేళ ఇన్వెస్టర్ మరణిస్తే, సంబంధిత వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రంలోని సమాచారం ఆధారంగా డిజిలాకర్ సిస్టమ్ ఖాతా వివరాలను మార్చుతుంది.
వినియోగదారి మరణించిన తర్వాత నామినీ వ్యక్తులకు SMS, ఇమెయిల్ ద్వారా నోటిఫికేషన్ అందుతుంది.
ఈ సేవల ద్వారా ఇన్వెస్టర్ మరణించిన తర్వాత నామినీలు సులభంగా షేర్లు, ఫండ్లను పొందే వీలు కలుగుతుంది.
దీనికోసం అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, RTAలు, డిపాజిటరీలను డిజిలాకర్ తమ సేవలకు నమోదు చేసుకోవాలని కోరింది.
ఫలితంగా, ఇన్వెస్టర్లు తమ డీమ్యాట్ అకౌంట్ వివరాలు, మ్యూచువల్ ఫండ్ స్టేటస్‌ను వేగంగా, సులభంగా పొందే అవకాశం ఉంటుంది.
ఇన్వెస్టర్ మరణించిన తర్వాత ఆ సమాచారాన్ని KRAలు డిజిలాకర్‌కు పంపి తదనుగుణంగా ఖాతా వివరాలను అప్‌డేట్ చేస్తాయి.