
Stock market: ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్.. భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పావెల్ జాక్సన్ హోల్ సింపోజియంలో వడ్డీ రేట్లపై ఏ విధమైన ప్రకటన చేస్తారనే అంశంపై మదుపర్లలో కాస్త అనిశ్చితి నెలకొంది. అంతే కాకుండా, భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం అదనపు సుంకాలను విధించనున్నారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది. ఈ గడువు సమీపించడంతో, వారాంతపు ట్రేడింగ్‌లో మార్కెట్ సూచీలు నష్టపోయాయి. ఫలితంగా, ఆరు రోజుల వరస లాభాల క్రమానికి బ్రేక్ పడింది. సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్ల మేర నష్టపోయగా, నిఫ్టీ మళ్లీ 25,000 స్థాయి దిగువన ముగిసింది.
వివరాలు
డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.53 గా నమోదు
సెన్సెక్స్ ఉదయం 81,951.48 పాయింట్ల వద్ద (ముందు ముగింపు 82,000.71) నష్టంతో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లో కొనసాగుతూ,ఇంట్రాడే కనిష్ఠంగా 81,291.77 పాయింట్ల వద్ద తాకింది. చివరికి 693.86 పాయింట్ల నష్టంతో 81,306.85 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 213.65 పాయింట్ల నష్టంతో 24,870.10 పాయింట్ల వద్ద ముగిసింది.డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.53 గా ఉంది. సెన్సెక్స్‌లో ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్,ఐటీసీ, టాటా స్టీల్,హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అయితే, మహీంద్రా అండ్ మహీంద్రా,మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, బీఈఎల్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లలో, బ్రెంట్ క్రూడ్ ధర 67.46 డాలర్ల వద్ద కొనసాగింది, బంగారం ఔన్సు ధర 3,329.30 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరిగింది.
వివరాలు
నష్టానికి ప్రధాన కారణాలు ఇవే:
సెప్టెంబర్‌లో జరగనున్న ఫెడరల్ రిజర్వ్ వడ్డీ సమీక్షలో 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో,జాక్సన్ హోల్ సింపోజియంలో పావెల్ ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తారనే అంశంపై మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెరికా వడ్డీ రేట్లు తగ్గిస్తే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు కలిసొస్తుంది.
వివరాలు
నష్టానికి ప్రధాన కారణాలు ఇవే:
అంతేకాక, రష్యా చమురును కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుండటంతో మదుపర్లలో ఆందోళన ఏర్పడింది. ఈ చర్య భారత ఆర్థిక వృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేయగలదనే భయాలు ఉన్నాయి. మన మార్కెట్ సూచీలు ఆరు రోజుల వరుస లాభాలతో రాణించినప్పటి తర్వాత, మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. ముఖ్యంగా ఫైనాన్షియల్,ఐటీ రంగం షేర్లలో అమ్మకాలు పెరగడం వల్ల సూచీలు నష్టపోయాయి.