Page Loader
Stock Market: కొత్త ఆర్థిక సంవత్సరంలో.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు
కొత్త ఆర్థిక సంవత్సరంలో.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Stock Market: కొత్త ఆర్థిక సంవత్సరంలో.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2025
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త ఆర్థిక సంవత్సరాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు సూచీల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ప్రతీకార టారిఫ్‌లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న తుది నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగా సూచీలు ఒత్తిడికి గురవుతున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 450 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 23,400 మార్క్ వద్ద ఊగిసలాడుతోంది.

వివరాలు 

నిఫ్టీ @ 23,433 

ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 374 పాయింట్ల నష్టంతో 77,035 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 85 పాయింట్ల నష్టంతో 23,433 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎంఅండ్‌ఎం, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 74.93 డాలర్లు 

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 74.93 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 3,174 డాలర్ల మార్క్‌ను దాటింది. అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ సూచీ 0.55 శాతం, డౌజోన్స్ 1 శాతం మేర లాభపడ్డాయి. నాస్‌డాక్ మాత్రం ఫ్లాట్‌గా ముగిసింది. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ASX సూచీ 0.63 శాతం, జపాన్ నిక్కీ 0.58 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 1.05 శాతం, షాంఘై 0.48 శాతం లాభంతో కదలాడుతున్నాయి.