
Stock market: నాలుగు రోజులలో 1,400 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్... స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోతోంది?
ఈ వార్తాకథనం ఏంటి
గత నాలుగు ట్రేడింగ్ రోజులుగా భారతీయ స్టాక్ మార్కెట్ క్రమంగా నష్టాల్లో కూరుకుపోతోంది. సెన్సెక్స్ 1,400 పాయింట్లకు మించి నష్టపోయింది. నిఫ్టీ 50 సుమారు 2 శాతం మేర వెనకడుగు వేసి 25,100 మార్క్ దిగువన స్థిరపడింది. మార్కెట్‌లో ఇలా కొనసాగుతున్న పతనం పెట్టుబడిదారుల్లో ఆందోళనను కలిగిస్తోంది. సోమవారం (జూలై 14) నాటి ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 247 పాయింట్లు (-0.30%) తగ్గి 82,253.46 వద్ద నిలిచింది. అదే సమయంలో, నిఫ్టీ 50 కూడా 68 పాయింట్లు (-0.27%) నష్టపోయి 25,082.30 వద్ద ముగిసింది. నాలుగు ట్రేడింగ్ సెషన్‌లలో సెన్సెక్స్ మొత్తం 1,459 పాయింట్లు (-1.74%) కోల్పోయింది. నిఫ్టీ 50 సైతం 1.72 శాతం మేర తగ్గింది.
వివరాలు
భారత స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలు ఏమిటి?
అయితే మార్కెట్‌లో ఈ పతనం నడుమ మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ విభాగాలు మాత్రం మెరుగైన ప్రదర్శనను చూపించాయి. సోమవారం బీఎస్‌ఈ మిడ్-క్యాప్ ఇండెక్స్ 0.67% పెరిగింది. అదే విధంగా స్మాల్-క్యాప్ ఇండెక్స్ 0.57% లాభపడింది. ఇది పెట్టుబడిదారుల ఆసక్తి మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ స్టాక్స్ వైపుగా మళ్లినట్లు సూచిస్తోంది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్‌లలో మార్కెట్లపై ఒత్తిడిని తీసుకొచ్చిన ఐదు ప్రధాన కారణాలను ఇప్పుడు చూద్దాం: ట్రేడ్ వార్ భయాలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలను మరింత కఠినతరం చేశారు. కెనడా నుంచి దిగుమతి చేసే ఉత్పత్తులపై 35% టారిఫ్ విధించిన ట్రంప్, ఆగస్టు 1 నుంచి మెక్సికో, యూరోపియన్ యూనియన్ (EU) దేశాల నుంచి దిగుమతులపై 30% టారిఫ్ వేస్తామన్నారు.
వివరాలు
ట్రేడ్ వార్ భయాలు:
ఇది గ్లోబల్ ట్రేడ్ వార్ మరింత కాలం కొనసాగుతుందనే సంకేతాలివ్వడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వృద్ధికి తీవ్రమైన భూతంగా మారనుందని సూచించింది. ఇక భారత్ విషయానికొస్తే... అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇది జరిగితే, అమెరికా భారత్‌పై విధించే టారిఫ్ రేట్లు 20% లోపు ఉండే అవకాశముంది. "భారత్ కోసం 20 శాతం టారిఫ్ రేటుతో ఒప్పందం కుదురితే మార్కెట్‌కు కొంత ఉపశమనం లభిస్తుంది. లేదంటే ఇది మార్కెట్‌ను మరింత నెగెటివ్ సెంటిమెంట్‌లోకి నెట్టవచ్చు" అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ తెలిపారు.
వివరాలు
2. లార్జ్-క్యాప్‌ల నుంచి మిడ్,స్మాల్ క్యాప్‌లకు నిధుల మళ్లింపు:
రిటైల్ పెట్టుబడిదారులు ఇప్పుడు మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ స్టాక్స్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టుతున్నారు. వీటి ఆదాయ వృద్ధి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లార్జ్-క్యాప్‌ల నుంచి నిధులు ఈ విభాగాలకు తరలిపోతుండటమే బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లలో బలహీనతకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. ఈక్వినోమిక్స్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు జి. చొక్కలింగం మాట్లాడుతూ, "4,000కు పైగా మిడ్, స్మాల్-క్యాప్ స్టాక్స్‌లో వృద్ధి అవకాశాలు ఉన్నాయి. రిటైల్ పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 22 కోట్లకు పైగా ఇన్వెస్టర్లు మార్కెట్లో నమోదు కాగా, వారానికి సుమారు 6 లక్షల మంది కొత్త పెట్టుబడిదారులు చేరుతున్నారు" అని వివరించారు.
వివరాలు
3. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ:
ఇటీవలి నాలుగు నెలలుగా భారత మార్కెట్లలో భారీగా పెట్టుబడి పెట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) ఇప్పుడు అమ్మకాల దిశగా మళ్లారు. వీరికి లార్జ్-క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువ యాజమాన్యం ఉండటంతో, అమ్మకాలు ఎక్కువగా లార్జ్-క్యాప్‌లలోనే జరుగుతున్నాయి. దీంతో బెంచ్‌మార్క్‌లపై ఒత్తిడి మరింత పెరిగింది. జూలై నెల ప్రారంభం నుండి 11వ తేదీ వరకు ఎఫ్‌పిఐలు ₹10,000 కోట్ల విలువైన భారత ఈక్విటీలు విక్రయించినట్టు డేటా వెల్లడించింది.
వివరాలు
4. అధిక వాల్యుయేషన్ భయాలు:
కార్పొరేట్ కంపెనీల ఆదాయ ఫలితాలు బలహీనంగా ఉండొచ్చన్న అంచనాలతో, నిపుణులు మార్కెట్ వాల్యుయేషన్‌పై ఆందోళన చెందుతున్నారు. నిఫ్టీ 50 ప్రస్తుత PE నిష్పత్తి 22.6గా ఉంది. ఇది గత ఏడాది సగటు PE 22.2 కంటే ఎక్కువ. సాలిడ్ ఆదాయ వృద్ధి సెప్టెంబరు త్రైమాసికం తర్వాత మాత్రమే కనిపించవచ్చని అంచనా.
వివరాలు
5. టెక్నికల్ ఫ్యాక్టర్ల ప్రభావం:
కోటక్ సెక్యూరిటీస్ ప్రకారం, నిఫ్టీ 25,350 లేదా సెన్సెక్స్ 83,200 స్థాయిల కన్నా తక్కువగా ట్రేడయ్యేంత వరకు మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగానే ఉంటుందని పేర్కొన్నారు. ఈ స్థాయిల కన్నా దిగువకు వెళ్లినట్లయితే, నిఫ్టీ 25,050 లేదా 82,000 స్థాయిల వరకు పడిపోవచ్చు. మరింత నష్టాలు వస్తే, నిఫ్టీ 24,800 వద్దకు కూడా చేరవచ్చని ఆ సంస్థ ఈక్విటీ రీసెర్చ్ అధిపతి శ్రీకాంత్ చౌహాన్ అన్నారు.