
Share Market: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో,దాని ప్రభావం దేశీయ షేర్ మార్కెట్లపై తీవ్రంగా కనిపిస్తోంది.
శుక్రవారం రోజు దలాల్ స్ట్రీట్ తీవ్రంగా నష్టాలను ఎదుర్కొంది. ఈ పరిస్థితుల కారణంగా సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పడిపోగా,నిఫ్టీ కీలకమైన 24వేల స్థాయిని కోల్పోయింది.
ఉదయం 11గంటల సమయంలో,సెన్సెక్స్ 919.49 పాయింట్లు పడిపోయి 79,416.32 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 295.1పాయింట్ల నష్టంతో 23,978.70వద్ద కొనసాగుతోంది.
యుద్ధానికి సంబంధించిన అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది.
మార్కెట్లలో తీవ్ర ఒడిదొడుకులు నెలకొనడంతో,మార్కెట్ వాలాటిలిటీని సూచించే ఇండెక్స్ అయిన 'విక్స్' 22.48వద్ద కొనసాగుతోంది.
అయితే,కొన్ని స్టాకులు మాత్రం లాభాల్లో ఉన్నాయి.లార్సెన్ అండ్ టుబ్రో,టాటా మోటార్స్,టైటాన్ కంపెనీ,భారత్ ఎలక్ట్రానిక్స్ లాంటి కంపెనీల షేర్లు లాభాల బాటలో ఉన్నాయి.
వివరాలు
యుద్ధ భయాల కారణంగా మార్కెట్లు నష్టాల్లోకి..
ఇక పవర్ గ్రిడ్ కార్పొరేషన్,జియో ఫైనాన్షియల్, ట్రెంట్,ఐసీఐసీఐ బ్యాంక్,శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి స్టాకులు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయంగా కొన్ని సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ,దేశీయంగా యుద్ధ భయాల కారణంగా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
'ఆపరేషన్ సిందూర్' పేరిట భారత్ చేపట్టిన సైనిక చర్యను పాకిస్తాన్ సహించలేక,భారత్ సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణులతో దాడులకు ప్రయత్నించిందని సమాచారం.
దీంతో భారత సైన్యం ప్రతిఘటనగా, పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థలపై దాడులకు పాల్పడింది.
ఈ దాడుల్లో లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నాశనం అయినట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధ భయాల ప్రభావంతో, మార్కెట్ నష్టాలు మరింతగా పెరుగుతున్నాయి.