
Stock Market: భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 1500 పాయింట్లు జంప్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి.
ట్రంప్ టారిఫ్‌లపై విరామం, అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం, ఇటీవల ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించిన నేపథ్యం వంటి సానుకూలాంశాల కారణంగా మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి.
దీంతో, సెన్సెక్స్ 1500 పాయింట్ల లాభంతో ప్రారంభమై, నిఫ్టీ 23,000 మార్క్‌ను దాటుకుని ట్రేడింగ్ ప్రారంభించింది.
ఉదయం 9.30 గంటలకు, సెన్సెక్స్ 1564 పాయింట్ల లాభంతో 76,700 వద్ద ట్రేడవుతూ, నిఫ్టీ 462 పాయింట్ల లాభంతో 23,288 వద్ద కొనసాగింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.84గా ఉంది.
వివరాలు
అమెరికా మార్కెట్లు లాభాలు నమోదు
టాటా మోటార్స్, లార్సెన్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి, అయితే హెచ్‌యూఎల్, నెస్లే షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులపై టారిఫ్‌ల నుంచి మినహాయింపు ప్రకటించడంతో, అమెరికా మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి.
ఈ ప్రకటన దేశీయ మార్కెట్లకు కూడా లాభదాయకంగా మారింది.