
Singapore: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్
ఈ వార్తాకథనం ఏంటి
విలాసానికి ఎటువంటి పరిమితులు ఉండవు. కానీ ఆ విలాసాన్ని ఆస్వాదించాలంటే తప్పనిసరిగా డబ్బు అవసరం. మీరు ఖర్చుకు వెనుకంజ వేయని వ్యక్తి అయితే.. ప్రపంచంలో అనేక ఖరీదైన నగరాల్లో మీరు కావాల్సిన సౌకర్యాలను అనుభవించడమే కాకుండా, మీరు కోరుకున్న ఖరీదైన వస్తువులను కూడా సులభంగా కొనుగోలు చేయవచ్చు. జూలియస్ బేర్ (Julius Baer) వార్షిక నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా (Most Expensive City) సింగపూర్ (Singapore) నిలిచింది. ఈ ఘనతను సింగపూర్ వరుసగా మూడో సంవత్సరం కూడా సొంతం చేసుకోవడం విశేషం.
వివరాలు
రెండో స్థానంలో లండన్
ఇక రెండో స్థానంలో ఉన్న హాంగ్‌కాంగ్‌ను వెనక్కి నెట్టి ఆ స్థానం లండన్ కైవసం చేసుకుంది. హాంగ్‌కాంగ్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కనీసం ఒక మిలియన్ డాలర్లు బ్యాంక్ ఖాతాలో ఉన్న ధనికులు కొనుగోలు చేస్తున్న విభిన్న ఉత్పత్తులు, వారు అనుభవిస్తున్న విలాసాలకు సంబంధించి వారి జీవన ఖర్చును జూలియస్ బేర్ లైఫ్‌స్టైల్ ఇండెక్స్ విశ్లేషించి ఈ నివేదికను విడుదల చేసింది. 2025 ఫిబ్రవరి-మార్చి మధ్య సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదిక తయారు చేసినట్లు సంస్థ తెలిపింది.
వివరాలు
ఖరీదైన నగరంగా సింగపూర్ ఎందుకు?
సింగపూర్‌లో ఆర్థిక,రాజకీయ పరిస్థితులు అంతర్జాతీయ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల అనేక మంది వ్యాపారులు తమ వ్యాపార కేంద్రాలను సింగపూర్‌లో స్థాపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాక,ఇప్పటికే వేరే దేశాలకు వెళ్లిన వ్యాపారులను తిరిగి రప్పించేందుకు సింగపూర్ ప్రభుత్వం కొన్ని కీలక సంస్కరణలు చేపట్టింది. దీంతో అక్కడ జీవన వ్యయం వేగంగా పెరిగింది.అదనంగా,ఇక్కడి ప్రజలు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడాన్ని ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ అంశాలు సింగపూర్‌ను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా నిలబెట్టాయని నివేదిక తెలిపింది. అలాగే,ఆహారం,బూట్లు,ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, విద్య వంటి రంగాలపై స్థానికులు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని జూలియస్ బేర్ వెల్లడించింది.
వివరాలు
హాంగ్‌కాంగ్‌ను వెనక్కి నెట్టి లండన్ పైకి..
నివేదిక ప్రకారం.. కరోనా ప్రభావం తగ్గినప్పటికీ, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయం, భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయని నివేదిక తెలిపింది. గత సంవత్సరం నివేదికతో పోలిస్తే.. లండన్ ఓ స్థానం పైకి ఎక్కింది. గతంలో రెండో స్థానంలో ఉన్న హాంగ్‌కాంగ్‌ను వెనక్కి నెట్టి లండన్ రెండో స్థానం సాధించింది. జ్యూరిచ్‌తో పాటు ఇతర యూరోప్ నగరాలు కూడా ఈ సారి తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నాయి. టాప్ 10 ఖరీదైన నగరాలు ఇవే 1. సింగపూర్ 2. లండన్ 3. హాంగ్‌కాంగ్ 4. షాంఘై 5. మొనాకో 6. జ్యూరిచ్ 7. న్యూయార్క్ 8. పారిస్ 9. సావో పౌలో 10. మిలాన్.