Smartphones: భారతదేశం నుంచి అమెరికాకు పెరిగిన స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు.. అధిక వాటా ఆపిల్ ఐఫోన్లదే
భారతదేశం నుంచి అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు అత్యంత వేగంగా పెరిగాయి. గత మూడు త్రైమాసికాల్లో, వీటి విలువ నాన్ ఇండస్ట్రియల్ డైమండ్ల ఎగుమతులను అధిగమించింది. 2024 జూన్‌లో ముగిసిన త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కాగా అదే సమయంలో డైమండ్ల ఎగుమతులు 1.44 బిలియన్ డాలర్ల వద్ద ఉన్నాయి. ఈ ఎగుమతుల్లో ఆపిల్ ఐఫోన్ల పాత్ర ముఖ్యమైనది. 2023 డిసెంబర్‌లో ముగిసిన త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 1.42బిలియన్ డాలర్లను చేరుకోగా, డైమండ్ల ఎగుమతులు 1.3 బిలియన్ డాలర్ల వద్ద ఉన్నవి. ఆ తరువాత త్రైమాసికంలో ఈ ఎగుమతులు 2.02 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో,సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో,భారత్ నుంచి అమెరికాకు స్మార్ట్‌ఫోన్లు నాలుగో స్థానం పొందాయి.
స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో ఐఫోన్లు కీలకమైన పాత్ర
భారత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్‌డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం స్మార్ట్‌ఫోన్ ఎగుమతులకు మంచి ప్రోత్సాహం అందించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. PLI విధానం ప్రారంభించే ముందు, స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల విలువ 1.6 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండేది. స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో ఆపిల్ ఐఫోన్ల వాటా అత్యధికంగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో, భారత్ నుంచి 5 బిలియన్ డాలర్ల విలువైన యాపిల్ ఐఫోన్లు ఎగుమతయ్యాయి. ఈ ఐఫోన్లు, మొత్తం 11.1 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో కీలకమైన పాత్ర పోషించాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో, ఐఫోన్ ఎగుమతుల విలువ 10 బిలియన్ డాలర్లను చేరుకోగా, భారత్ నుంచి మొత్తం ఎగుమతుల్లో వాటా 66 శాతానికి చేరుకుంది.