Stock Market: ఆర్‌బీఐ సమీక్ష నిర్ణయాలకు ముందు.. ఒడుదొడుకులకు లోనవుతున్న దేశీయ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వచ్చినా, వాణిజ్య యుద్ధ ఆందోళనలు ఇంకా మదుపర్లను ప్రభావితం చేస్తున్నాయి.
ఆర్ బి ఐ పరపతి విధాన సమీక్షా నిర్ణయాలు శుక్రవారం ప్రకటించబోతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా ఉన్నారు.
ఈ పరిస్థితిలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఒడుదొడుకులకు లోనవుతున్నాయి.
ఉదయం 9.30 గంటల వద్ద, సెన్సెక్స్ 93.92 పాయింట్లు తగ్గి 78,177.96 వద్ద, నిఫ్టీ 32.85 పాయింట్లు పడిపోయి 23,663 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
అంతకుముందు ప్రీ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 280 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైనప్పటికీ, ఆ జోరు కొనసాగలేదు.
వివరాలు
నష్టాలను నమోదు చేసిన స్విగ్గీ షేర్లు
నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, బీపీసీఎల్ షేర్లు పెరుగుతుండగా, శ్రీరామ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి.
మరింత పతనమైన రూపాయి.. మరోవైపు, రూపాయి విలువ నిత్యం క్షీణిస్తుంది. నేటి ట్రేడింగ్‌లో మరో 12 పైసలు తగ్గి, 87.55 వద్ద సరికొత్త కనిష్టానికి పడిపోయింది.
52 వారాల కనిష్ఠం నమోదు చేసిన స్విగ్గీ షేర్లు.. ఆహార పదార్థాలు, సరకులు డెలివరీ చేసే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ అయిన స్విగ్గీ, 2024-25 డిసెంబరు త్రైమాసికంలో రూ.799.08 కోట్ల ఏకీకృత నష్టాన్ని ప్రకటించింది.
ఈ నేపథ్యంలో స్విగ్గీ షేర్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి.
వివరాలు
లాభాలలో అమెరికా మార్కెట్లు
ఒక దశలో షేరు విలువ బీఎస్‌ఈలో 7.4 శాతం తగ్గి రూ.385.25 వద్ద 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ఉదయం 9.45 గంటల సమయంలో స్విగ్గీ షేర్లు 4.08 శాతం నష్టంతో రూ.401.05 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ఆసియా పసిఫిక్ మార్కెట్లు..
ఆసియా పసిఫిక్ మార్కెట్లు గురువారం సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి.
ఆస్ట్రేలియా ASX 0.9 శాతం, జపాన్ నిక్కీ 0.39 శాతం, దక్షిణ కొరియా కోస్పి 0.45 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 0.31 శాతం మేర లాభాల్లో ఉన్నాయి.
అటు, అమెరికా మార్కెట్లు బుధవారం లాభాలు సాధించాయి. డోజోన్స్ 0.71 శాతం, ఎస్ అండ్ పీ సూచీ 0.39 శాతం, నాస్డాక్ 0.19 శాతం లాభపడ్డాయి.