Loading...
Supreme court on MDR: యూపీఐ ఛార్జీలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు.. స్టేపై కీలక నిర్ణయం
యూపీఐ ఛార్జీలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు.. స్టేపై కీలక నిర్ణయం

Supreme court on MDR: యూపీఐ ఛార్జీలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు.. స్టేపై కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 28, 2026
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూపీఐ లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (MDR) విధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే.. అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి రానున్న ఎండీఆర్‌ ఛార్జీలపై మధ్యంతర స్టే విధించేందుకు ధర్మాసనం నిరాకరించింది. రూ.2 వేలు దాటిన నిర్దిష్ట యూపీఐ పర్సన్‌-టు-మర్చంట్‌ (P2M) లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ విధించే కొత్త విధానాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ విధానం అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి సెప్టెంబర్‌ 14న కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేయగా.. సెప్టెంబర్‌ 15న ఎండీఆర్‌ విధానాన్ని ప్రకటించింది.

వివరాలు 

నాలుగు వారాల్లో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలి: సుప్రీం 

ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది అంజన్‌ దత్తా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు.

ఎండీఆర్‌ విధానాన్ని రద్దు చేయాలని, దాని అమలును నిలిపివేయాలని పిటిషన్‌లో కోరారు.

తగిన చట్టపరమైన రక్షణలు, పారదర్శకత, ప్రజా సంప్రదింపులు లేకుండానే ఈ విధానాన్ని తీసుకొచ్చారని పిటిషనర్‌ పేర్కొన్నారు.

ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనతో కూడిన ధర్మాసనం విచారించింది.

ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI), నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI)లకు నోటీసులు జారీ చేసింది.

వివరాలు 

ఎండీఆర్‌ ఛార్జీలపై ప్రస్తుతానికి ఎలాంటి మధ్యంతర స్టే ఇవ్వబొం: సుప్రీం  

అయితే అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి రానున్న ఎండీఆర్‌ ఛార్జీలపై ప్రస్తుతానికి ఎలాంటి మధ్యంతర స్టే ఇవ్వబోమని పిటిషనర్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది.

కేంద్రం నిర్ణయించిన విధానం ప్రకారం.. రూ.2 వేలు దాటిన సాధారణ P2M యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ వర్తిస్తుంది.

రూ.75 వేలకుపైబడిన లావాదేవీలకు ఈ ఛార్జీ గరిష్ఠంగా రూ.300కు పరిమితం కానుంది.

ఇదిలా ఉండగా, ఎండీఆర్‌ ఛార్జీల వల్ల 96 శాతం మంది వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.వెంకటరామన్‌ విచారణ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

ADVERTISEMENT