Swiggy: కొత్త తరహా సేవలకు శ్రీకారం చుట్టిన ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ
త్వరలో పబ్లిక్ ఇష్యూకు రాబోయే ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy) కొత్త తరహా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు భారతదేశంలో ఉన్న తమ బంధుమిత్రులకు ఫుడ్ ఆర్డర్ చేయించుకునే అవకాశాన్ని అందించేందుకు 'ఇంటర్నేషనల్ లాగిన్' సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. అమెరికా, కెనడా, జర్మనీ, యూకే వంటి దేశాల నుండి ఈ సేవను ఉపయోగించుకోవచ్చని స్విగ్గీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులు, యూపీఐ ద్వారా చెల్లింపులు
స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయడం మాత్రమే కాకుండా, స్విగ్గి ఇన్‌స్టామార్ట్‌లో వస్తువులు కొనుగోలు చేయడం, డైనవుట్ ద్వారా టేబుల్స్ బుక్ చేసుకోవడం కూడా సాధ్యమవుతుంది. అంతేకాకుండా, ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులు, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. విదేశాల్లో ఉన్న వారు భారతదేశంలో నివసిస్తున్న తమ స్నేహితులను ఆశ్చర్యపరచడం కోసం ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ తెలిపారు.
త్వరలో ఐపీఓకి స్విగ్గీ
స్విగ్గీ త్వరలో ఐపీఓకి రాబోతుంది. ఇప్పటికే సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) నుండి ఆమోదం పొందిన ఈ సంస్థ, సుమారు రూ.10,000 కోట్లు మార్కెట్ నుంచి సమీకరించనుంది. ఫ్రెష్, ఆఫర్ ఫర్ సేల్ రూపంలో షేర్లను విక్రయించనుంది. ఈ నేపథ్యంలో, ఇటీవల స్విగ్గీ ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచింది. అలాగే, ఆహార నాణ్యతకు సీల్, బోల్ట్ అనే పేర్లతో 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ అందించేందుకు, బల్క్ ఆర్డర్ల కోసం 'XL' అనే కొత్త తరహా సేవలను కూడా అందించడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఇంటర్నేషనల్ లాగిన్ సదుపాయాన్ని ప్రవేశపెట్టడం చాలా ముఖ్యమైన విషయం.