Swiggy- Zomato: స్విగ్గీ, జొమాటో కొత్తతరహా సేవలకు శ్రీకారం.. త్వరలో లాంచ్
స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ప్రస్తుతం కొత్త సేవలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మొదట ఈ యాప్స్ కేవలం ఫుడ్ డెలివరీ కోసం మాత్రమే ఉండగా, తరువాత క్విక్ కామర్స్ రంగంలోకి ప్రవేశించాయి. ఇప్పుడు మరిన్ని సేవలను అందించేందుకు యత్నిస్తున్నట్లు 'ఎకనామిక్ టైమ్స్' పేర్కొంది. ఇటీవల ఐపీఓ పూర్తిచేసుకున్న స్విగ్గీ త్వరలో 'యెల్లో' పేరుతో కొత్త సేవలను ప్రారంభించాలనుకుంటోంది. లాయర్లు,థెరపిస్టులు,ఫిట్‌నెస్ ట్రైనర్లు,ఆస్ట్రాలజర్లు,డైటీషియన్లను ఒకే ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులోకి తీసుకురావాలనుకుంటోంది. దీనిని కొత్త యాప్‌గా తెస్తారా లేక స్విగ్గీ యాప్‌లోనే ఆప్షన్‌గా కొనసాగిస్తారా అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే 'రేర్' పేరిట ప్రీమియం కస్టమర్లకు ఫార్ములా 1 రేస్, మ్యూజిక్ కాన్సర్ట్, ఆర్ట్ ఎగ్జిబిషన్లకు ప్రవేశం కల్పించాలనే ఆలోచనలో ఉంది.
పలు రంగాల్లో జొమాటో
మరోవైపు, జొమాటో కూడా వాట్సాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకొనే సదుపాయం తీసుకురావాలని ప్రణాళికలో ఉంది. చాట్‌బాట్‌ల బదులు, ఆర్డర్ ప్రక్రియలో మనుషులను వినియోగించాలనేది జొమాటో ఆలోచన. అంతేకాకుండా బ్లింకిట్ వేదిక ద్వారా ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్ల సేవలను కూడా అందించేందుకు ప్రణాళికలో ఉంది. పేటీఎం టికెటింగ్ బిజినెస్ కొనుగోలుతో పలు రంగాల్లో జొమాటో ఇప్పటికే ప్రవేశించింది.
పోటీతత్వ చట్టాలను ఉల్లంఘించినట్లు సీసీఐ దర్యాప్తు
తాజాగా, జొమాటో 'ఫుడ్ రెస్క్యూ' అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. వినియోగదారులు క్యాన్సిల్ చేసిన ఆర్డర్లను సమీప కస్టమర్లు డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా తక్కువ ధరలో ఫుడ్ త్వరగా అందించవచ్చని, ఫుడ్ వేస్టేజీని తగ్గించడం ఈ ఫీచర్ ముఖ్య ఉద్దేశమని జొమాటో సీఈఓ దీపిందర్ గోయెల్ తెలిపారు. స్విగ్గీ, జొమాటో దేశీయ చట్టాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నాయి. ఈ రెండు కంపెనీలు పోటీతత్వ చట్టాలను ఉల్లంఘించినట్లు సీసీఐ దర్యాప్తులో తేలడంతో ఈ ప్రకటనలు వచ్చాయి.