
Exports: దేశ ఎగుమతుల్లో టాప్-5లో చోటు దక్కించుకునే దిశగా తెలుగు రాష్ట్రాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాలు ఎగుమతుల రంగంలో గణనీయమైన పురోగతి సాధిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఎగుమతుల పరిమాణం పెరగటమే కాకుండా,వాటి విభాగాలు కూడా విస్తరిస్తున్నాయి. గతంలో వ్యవసాయ ఉత్పత్తులే తెలుగు రాష్ట్రాల నుంచి అధికంగా ఎగుమతయ్యేవి.. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇంజినీరింగ్ ఉత్పత్తులు,ఔషధాలు,రసాయనాలు,ఎలక్ట్రానిక్స్ వంటి తయారీ రంగ ఉత్పత్తులు (మ్యాన్‌ఫ్యాక్చర్డ్ గూడ్స్) ఎగుమతుల్లో వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సాధిస్తున్న వృద్ధి దేశవ్యాప్తంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం రాబోయే సంవత్సరాల్లో ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు మరింతగా పెరగడానికి అనువైన వాతావరణం (ఎకో సిస్టమ్) ఈ రెండు రాష్ట్రాల్లో ఏర్పడుతోంది.
వివరాలు
రక్షణ, అంతరిక్ష రంగంలో తెలంగాణ ప్రాధాన్యం
2024-25 ఆర్థిక సంవత్సరానికి అత్యధిక ఎగుమతులు చేసిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో,తెలంగాణ 7వ స్థానంలో నిలిచాయి. త్వరలోనే ఈ రెండు రాష్ట్రాలు టాప్-5 జాబితాలోకి చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం దేశంలో రక్షణ,అంతరిక్ష రంగానికి ప్రధాన కేంద్రంగా అవతరిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం రక్షణ ఉత్పత్తుల తయారీలో కీలక హబ్‌గా ఎదుగుతోంది. ఇక్కడ బీడీఎల్, మిధాని, డీఆర్‌డీఎల్ వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ అనేక కంపెనీలు రక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తులు తయారు చేసి భారత సైన్యానికి సరఫరా చేస్తూనే, వాటిని విదేశాలకు కూడా విస్తృతంగా ఎగుమతి చేస్తున్నాయి. ఇదే సమయంలో స్పేస్‌టెక్ పరిశ్రమలు కూడా ఇక్కడ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
వివరాలు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రోత్సాహక విధానాలు
అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల పారిశ్రామిక వాడల్లో ఇంజినీరింగ్ ఉత్పత్తుల యూనిట్లు, కంపెనీలు పెద్ద ఎత్తున స్థాపించబడుతున్నాయి. దీనివల్ల ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు గత కొన్నేళ్లలోనే గణనీయంగా పెరిగే అవకాశం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రోత్సాహక విధానాలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అన్ని కలిసి ఈ వృద్ధికి తోడ్పడుతున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎగుమతుల దిశా మార్పు
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం కావడంతో ఇక్కడ నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తుల్లో వ్యవసాయోత్పత్తులే ఎక్కువగా కనిపిస్తాయి. ధాన్యం, పొగాకు, కాఫీ, మిర్చి, పసుపుతో పాటు చేపలు, రొయ్యలు, రొయ్యల మేత వంటి ఉత్పత్తులు ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు తరలిపోతుంటాయి. అయితే ఇటీవల సంవత్సరాల్లో ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ఔషధాలు వంటి తయారీ ఉత్పత్తుల ఎగుమతులు వేగంగా పెరుగుతున్నాయి. పరిశ్రమల శాఖ అంచనాల ప్రకారం వచ్చే రెండు-మూడు సంవత్సరాల్లో ఈ విభాగాల ఎగుమతులు మరింతగా పెరగనున్నాయి. దీనికి అనుగుణంగా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోంది.
వివరాలు
అంకుర సంస్థలకు మద్దతు
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నారు. ఈ ఆధారాన్ని తగ్గించాలంటే పరిశ్రమలను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు కల్పించడం తప్పనిసరి. అందుకే ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటు, పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు అందించడం, అంకుర సంస్థలకు (స్టార్టప్‌లకు) మద్దతు ఇవ్వడం వంటి చర్యలను ముందుకు తీసుకెళ్తోంది. వీటివల్ల రాబోయే కాలంలో ఎగుమతులు మరింతగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.