Page Loader
Trump Tariffs: ట్రంప్‌ టారిఫ్‌లు..భారీగా నష్టపోయిన బిలియనీర్లు.. మెటా అధినేత  సంపద 17.9 బిలియన్‌ డాలర్లు ఆవిరి 
ట్రంప్‌ టారిఫ్‌లు..భారీగా నష్టపోయిన బిలియనీర్లు

Trump Tariffs: ట్రంప్‌ టారిఫ్‌లు..భారీగా నష్టపోయిన బిలియనీర్లు.. మెటా అధినేత  సంపద 17.9 బిలియన్‌ డాలర్లు ఆవిరి 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 04, 2025
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల (Trump Tariffs) ప్రభావంతో అంతర్జాతీయంగా అనేక స్టాక్‌ ఎక్స్ఛేంజీల మార్కెట్లు భారీగా కుదేలయ్యాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా తీవ్రంగా పతనమయ్యాయి. ఈ ప్రభావం బిలియనీర్ల సంపదపైనా తీవ్రంగా పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 మంది సంపన్నుల మొత్తం సంపద (Billionaires Wealth) 208 బిలియన్‌ డాలర్లు తగ్గిపోయింది. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ.17 లక్షల కోట్లకు సమానం. గత దశాబ్ద కాలంలో ఈ స్థాయిలో సంపన్నుల సంపద నష్టపోవడం ఇదే తొలిసారి. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కూడా భారీగా ఆస్తిని కోల్పోయిన వారిలో ఉన్నారు.

వివరాలు 

2022 ఏప్రిల్‌ తర్వాత.. అమెజాన్‌ షేర్లు పతనమవడం ఇదే తొలిసారి

ఈ సంక్షోభంలో అత్యధికంగా నష్టపోయిన వ్యక్తి మెటా సంస్థ అధినేత మార్క్ జూకర్ బర్గ్ (Mark Zuckerberg). అతని సంపద ఏకంగా 17.9 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1.5 లక్షల కోట్లు) మేర తగ్గిపోయింది. ఇది అతని మొత్తం సంపదలో 9% నష్టానికి సమానం. ట్రంప్‌ టారిఫ్‌ల ప్రకటన తర్వాత, అమెరికా స్టాక్ మార్కెట్లో మెటా షేర్లు 8%కు పైగా పడిపోవడమే దీనికి కారణం. అమెజాన్‌ షేర్లు 9% మేర తగ్గడంతో, ఆ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos) సంపద 15.9 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1.3 లక్షల కోట్లు) తగ్గిపోయింది. 2022 ఏప్రిల్‌ తర్వాత ఈ స్థాయిలో అమెజాన్‌ షేర్లు పతనమవడం ఇదే తొలిసారి.

వివరాలు 

 ఎలాన్‌ మస్క్‌ సంపద 11 బిలియన్‌ డాలర్లు 

టెస్లా షేర్లు 5.5% మేర పడిపోవడంతో, ఎలాన్‌ మస్క్‌ సంపద 11 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.93 వేల కోట్లు) నష్టపోయింది. డెల్‌ సీఈఓ మైఖేల్‌ డెల్‌ సంపద 9.53 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.81 వేల కోట్లు),ఒరాకిల్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ ల్యారీ ఎలిసన్‌ సంపద 8.1 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.69 వేల కోట్లు) మేర తగ్గాయి. ఎన్విడియా సీఈఓ జెన్సెన్‌ హువాంగ్‌ సంపద 7.36బిలియన్‌ డాలర్లు,గూగుల్‌ మాజీ సీఈఓ ల్యారీ పేజ్‌ 4.79 బిలియన్‌ డాలర్లు,గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ 4.46 బిలియన్‌ డాలర్ల మేర నష్టపోయారు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కుబేరుడు బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ సంపద 6బిలియన్‌ డాలర్లు తగ్గిపోయిందని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్ ఇండెక్స్‌ వెల్లడించింది.