LOADING...
UPI payments: యూపీఐ లావాదేవీలపై తప్పుడు ప్రచారం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం
యూపీఐ లావాదేవీలపై తప్పుడు ప్రచారం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం

UPI payments: యూపీఐ లావాదేవీలపై తప్పుడు ప్రచారం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
09:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు వసూల్ చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం చిన్నపాటి షాపుల దగ్గర నుంచి పెద్దదాకా చాలా మంది వినియోగదారులు గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ ఆధారిత అప్లికేషన్‌లను ఉపయోగించి డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) పేరుతో ఛార్జీలు వసూలు చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రూ.3000 కన్నా ఎక్కువ విలువగల యూపీఐ లావాదేవీలపై ఈ ఛార్జీలు వర్తింపజేస్తారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ ప్రచారం పూర్తిగా నిరాధారమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలా తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.

వివరాలు 

డిజిటల్ లావాదేవీల నిర్వహణకు అధిక వ్యయాలు 

మరోవైపు, డిజిటల్ లావాదేవీల నిర్వహణకు అధిక వ్యయాలు ఎదురవుతున్నాయని బ్యాంకులు, పేమెంట్ సేవల సంస్థలు కలవరపడుతున్నట్టు కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ దృష్ట్యా కేంద్రం ఎండీఆర్ ఛార్జీలను విధించాలనే ఆలోచనలో ఉందన్న వార్తలు వెలువడ్డాయి. వ్యాపారుల ఆదాయాన్ని ఆధారంగా కాకుండా, వారు చేసే లావాదేవీల విలువను బేస్ చేసుకొని ఎండీఆర్ వసూలు చేయాలని చర్చలు జరుగుతున్నాయని ఈ కథనాల్లో పేర్కొన్నారు. మరింత విలువగల డిజిటల్ లావాదేవీల నిర్వహణలో ఖర్చులు పెరుగుతుండటమే ఇందుకు కారణమని కొన్ని నివేదికలు స్పష్టం చేశాయి.

వివరాలు 

అవాస్తవ ప్రచారాలను నమ్మకండి 

ఈ నేపథ్యంలో వస్తున్న ఊహాగానాలను ఖండిస్తూ కేంద్రం గట్టిగా స్పందించింది. ఇటువంటి అవాస్తవ ప్రచారాలను నమ్మరాదని ఆర్థిక శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. తప్పు సమాచారం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ రకమైన ప్రచారాలు ప్రజల్లో అనవసరమైన గందరగోళానికి, భయాందోళనకు దారితీస్తున్నాయని ఆ శాఖ ఆవేదన వ్యక్తం చేసింది. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేసింది.