
US: రూ.7 లక్షల కోట్ల టారిఫ్ భారంతో అమెరికా కంపెనీలకు కఠిన పరీక్ష
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన టారిఫ్ ప్రణాళికలు ఆ దేశంలోని ప్రముఖ కంపెనీలపై భారీ ఆర్థిక భారం మోపే అవకాశముందని తాజా విశ్లేషణలు హెచ్చరిస్తున్నాయి. జేపీ మోర్గాన్ చేజ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం, ఈ టారిఫ్‌లు సుమారుగా 82.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 7 లక్షల కోట్లు) మేర వ్యయ భారాన్ని కంపెనీలపై మోపే అవకాశం ఉంది.
Details
మధ్యతరహా కంపెనీలపై ఎక్కువ ప్రభావం
టారిఫ్‌ల ప్రభావం ముఖ్యంగా 10 మిలియన్ డాలర్లు (రూ. 85 కోట్లు) నుంచి 1 బిలియన్ డాలర్లు (రూ. 8,500 కోట్లు) మధ్య ఆదాయం కలిగిన సంస్థలపై ఎక్కువగా ఉండనుంది. అమెరికాలో ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో మూడవ వంతు ఈ కంపెనీల నుంచే వస్తోంది. ఈ సంస్థలు చైనా, భారత్, థాయ్‌లాండ్ వంటి దేశాల నుంచి దిగుమతులపై ఆధారపడుతున్నాయి. ముఖ్యంగా రిటైల్, టోకు రంగాల్లో ఈ భారం తీవ్రంగా పడనుందని అంచనా.
Details
ట్రంప్ అంచనాలకు భిన్నంగా విశ్లేషణ
టారిఫ్‌లు అమెరికా కంపెనీలకు తక్కువ భారం కలిగిస్తాయని, విదేశీ తయారీదారులే వ్యయాన్ని భరిస్తారని ట్రంప్ భావించినా, ఈ విశ్లేషణకు అది విరుద్ధంగా ఉంది. అమెరికా కంపెనీలపై సుడిగాలి వంటి ప్రభావం చూపే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ చెబుతోంది. ట్రంప్ ఇటీవల చైనా, మెక్సికో, కెనడాలపై భారీ టారిఫ్‌లు విధించడమే కాకుండా, ఉక్కు, అల్యూమినియంపై 50% టారిఫ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్టు 1న ఈ టారిఫ్‌లు అమల్లోకి రానున్న నేపథ్యంలో, ఈ విశ్లేషణ ప్రాధాన్యతను సంతరించుకుంది.
Details
వినియోగదారులపై భారం మళ్లింపు
గోల్డ్‌మాన్ సాక్స్ అంచనా ప్రకారం, టారిఫ్ వ్యయాల్లో 60% వరకు వినియోగదారులకే కంపెనీలు భారం మళ్లించే అవకాశం ఉంది. దీని ఫలితంగా వస్తువుల ధరలు పెరగడమే కాక, ద్రవ్యోల్బణం తీవ్రతరమవొచ్చు. అయితే కొన్ని దేశీయ తయారీదారులకు ఇది అవకాశం కావొచ్చని జేపీ మోర్గాన్ అభిప్రాయపడుతోంది. కానీ తక్కువ లాభాల మార్జిన్లలో నడుస్తున్న రిటైల్, టోకు రంగ సంస్థలు తమ వ్యయాన్ని వినియోగదారులపై మళ్లించాల్సిన పరిస్థితిలో పడవచ్చు.
Details
విధానాలు, ఒప్పందాలపై అనిశ్చితి
టారిఫ్ విధానాల దిశ ఇంకా స్పష్టంగా లేకపోవడంతో మార్కెట్లలో, వ్యాపార రంగంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. అమెరికా ఆర్థిక శాఖ, వాణిజ్య శాఖ, యూఎస్ ట్రేడ్ రెప్రజెంటేటివ్ కార్యాలయాల్లో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న అధికారులు సైతం ఇటువంటి వాణిజ్య పరిస్థితులను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించడమే దీని తీవ్రతను తెలియజేస్తుంది.
Details
ముందే అమల్లోకి వచ్చివుంటే మరింత భారమే
ట్రంప్ ఏప్రిల్ 2న ప్రకటించిన టారిఫ్‌లు అప్పుడే అమల్లోకి వచ్చివుంటే, అమెరికా సంస్థలు అదనంగా 187.6 బిలియన్ డాలర్లు వ్యయం చేయాల్సి వచ్చేది. ప్రస్తుత టారిఫ్‌ల కింద 82.3 బిలియన్ డాలర్ల భారం మిగిలిపోనుంది. ఇది ఒక్కో ఉద్యోగికి సగటున 2080 డాలర్లు లేదా వార్షిక వేతనంలో సుమారు 3.1%కి సమానం. ఇదిలా ఉండగా, బ్రిటన్ ఇప్పటికే అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసగా, భారత్ మరియు వియత్నాం కూడా త్వరలో ఓ ఒప్పందానికి చేరుకునే దశలో ఉన్నట్టు ప్రకటించాయి.