LOADING...
Indian Oil Companies: భారత్‌కు చెందిన ఆరు చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు
భారత్‌కు చెందిన ఆరు చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు

Indian Oil Companies: భారత్‌కు చెందిన ఆరు చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2025
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌పై అమెరికా 25శాతం కస్టమ్స్‌ సుంకాలు విధింపు వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌ చమురు ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్‌ చేయడం అనే కారణంతో, ప్రపంచవ్యాప్తంగా 20 కంపెనీలపై ఆంక్షలు విధించినట్లు వాషింగ్టన్‌ ప్రకటించింది. ఈ సంస్థలలో భారత్‌కు చెందిన ఆరు కంపెనీలు కూడా ఉండటం గమనార్హం. అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారత్‌కు చెందిన ఆరు చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు

వివరాలు 

టెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు అమెరికా ఈ కఠిన నిర్ణయం 

''ఇరాన్‌ చమురు విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, అస్థిరతలకు ఉపయోగిస్తుంది. అంతేకాకుండా, ఈ నిధుల ద్వారా ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక మద్దతు అందిస్తోంది. దీని వల్ల ప్రపంచ శాంతికి హానికరం కలుగుతోంది. అందువల్లే టెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు అమెరికా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌ చమురు, పెట్రోకెమికల్‌ ఉత్పత్తుల కొనుగోళ్లకు సహకరిస్తున్న 20 సంస్థలపై ఆంక్షలు అమలు చేస్తున్నాం'' అని అగ్రరాజ్యం తమ ప్రకటనలో స్పష్టం చేసింది.

వివరాలు 

ఇరాన్‌ ఉత్పత్తులను కొనుగోలు చేసే ఏ సంస్థైనా అమెరికా ఆంక్షలు ఎదుర్కొక తప్పదు

భారత్‌తో పాటు యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE), తుర్కియే, ఇండోనేషియా దేశాల కంపెనీలు కూడా ఈ ఆంక్షల జాబితాలో ఉన్నాయి. "అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ స్పష్టం చేసినట్లే, ఇరాన్‌ ఉత్పత్తులను కొనుగోలు చేసే ఏ సంస్థైనా అమెరికా ఆంక్షలు ఎదుర్కొక తప్పదు. అంతేకాదు, వారు ఇకపై అమెరికాతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండే అర్హతను కోల్పోతారు'' అని వాషింగ్టన్‌ ఈ సందర్భంగా హెచ్చరించింది.

వివరాలు 

అమెరికా ఆంక్షలు విధించిన భారత కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి: 

1. కాంచన్‌ పాలిమర్స్‌ (Kanchan Polymers): 2024 ఫిబ్రవరి నుంచి జులై మధ్య కాలంలో, యూఏఈలోని ఒక మధ్యవర్తిత్వ సంస్థ నుంచి 1.3 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్‌ పాలిథీన్‌,ఇతర పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నదని అమెరికా ఆరోపించింది. 2. ఆల్‌కెమికల్‌ సొల్యూషన్స్‌ (Alchemical Solutions): ఇది ఓ పెట్రోకెమికల్‌ ట్రేడింగ్ కంపెనీ. 2024 జనవరి నుంచి డిసెంబర్ మధ్య, మొత్తం 84మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్‌ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నట్టు అమెరికా తెలిపింది. 3. రమణిక్‌లాల్ ఎస్ గోసాలియా అండ్ కంపెనీ: 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు,ఈ సంస్థ 22 మిలియన్ డాలర్ల విలువైన మిథనాల్‌, టోల్యూన్‌, ఇతర పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను ఇరాన్ నుంచి కొనుగోలు చేసిందని ఆరోపణలున్నాయి.

వివరాలు 

అమెరికా ఆంక్షలు విధించిన భారత కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి: 

4. జుపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ (Jupiter Dychem Pvt. Ltd): 2024-25 కాలంలో ఈ కంపెనీ 49 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఇరాన్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుందన్న సమాచారం ఉంది. 5. గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లిమిటెడ్ (Global Industrial Chemicals Ltd): గతేడాది కాలంలో 51 మిలియన్ డాలర్ల పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను ఇరాన్ నుంచి కొనుగోలు చేసింది అని అమెరికా ఆరోపిస్తోంది. 6. పర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్ (Persistent Petrochem Pvt. Ltd): ఈ సంస్థ గతేడాది 14 మిలియన్ డాలర్ల విలువైన మిథనాల్‌తో సహా ఇతర ఇరాన్‌ ఉత్పత్తులను దిగుమతి చేసిందని అమెరికా అభియోగం వేసింది.

వివరాలు 

అమెరికాలో ఆస్తులు ఉంటే..

ఈ ఆరు కంపెనీలన్నీ ఉద్దేశపూర్వకంగా ఇరాన్‌తో వాణిజ్యంలో పాల్గొన్నాయని వాషింగ్టన్‌ వ్యాఖ్యానించింది. తాజా ఆంక్షల నేపథ్యంలో, ఇప్పుడు ఆయా కంపెనీలు, వ్యక్తులకు అమెరికాలో ఆస్తులు ఉంటే వాటిని ఫ్రీజ్‌ చేస్తారు.