LOADING...
Trump Tariffs Effect: ట్రంప్‌ సుంకాల దెబ్బ.. భారత్‌ స్టాక్‌కు 'బ్రేక్'..వెనక్కి తగ్గిన అమెజాన్‌, వాల్‌మార్ట్‌ 
ట్రంప్‌ సుంకాల దెబ్బ.. భారత్‌ స్టాక్‌కు 'బ్రేక్'..వెనక్కి తగ్గిన అమెజాన్‌, వాల్‌మార్ట్‌

Trump Tariffs Effect: ట్రంప్‌ సుంకాల దెబ్బ.. భారత్‌ స్టాక్‌కు 'బ్రేక్'..వెనక్కి తగ్గిన అమెజాన్‌, వాల్‌మార్ట్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 08, 2025
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 50 శాతం టారిఫ్‌లు (సుంకాలు) విధించడంతో వ్యాపార రంగంలో పెద్ద కలకలం రేగింది. ఈ అదనపు భారం ఎగుమతిదారులే భరించాలా? లేక అమెరికా దిగుమతి సంస్థలే మోసాలా? అన్న విషయంలో స్పష్టత లేక అయోమయం నెలకొంది. ఈ పరిణామాల (Trump Tariffs Effect) నేపథ్యంలో అమెరికా రిటైల్‌ మార్కెట్‌ దిగ్గజాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ నుంచి స్టాక్‌ దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.

వివరాలు 

ఎగుమతులపై 'స్టాప్' ఆర్డర్‌ 

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దుస్తులు, ఫ్యాషన్‌ ఉత్పత్తుల ఎగుమతులను నిలిపివేయాలని అమెరికా దిగుమతి సంస్థలు భారత టోకు వ్యాపారులకు లేఖలు, ఈమెయిల్స్‌ పంపినట్లు తెలుస్తోంది. వాల్‌మార్ట్‌, అమెజాన్‌, టార్గెట్‌, గ్యాప్‌ వంటి ప్రముఖ సంస్థలు ఈ సందేశాలను పంపాయని కథనాలు సూచిస్తున్నాయి. సుంకాల పెంపుతో వస్తువుల ధరలు పెరగడం వల్ల కొనుగోలుదారులు అదనపు ఖర్చును భరించడానికి ముందుకురావడం లేదని సమాచారం. ఈ అదనపు భారాన్ని పూర్తిగా ఎగుమతిదారులే మోసాలన్న డిమాండ్‌ను ఆయా కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.

వివరాలు 

ధరల పెరుగుదల, ఆర్డర్ల తగ్గుదల భయం 

ట్రంప్‌ (Donald Trump) సుంకాల పెంపు కారణంగా అమెరికాలో భారత ఉత్పత్తుల ధరలు 30 నుంచి 35 శాతం వరకు పెరగనున్నాయని అంచనా. ధరలు పెరిగితే కొనుగోళ్లు తగ్గడం సహజం. ఈ పరిస్థితిలో భారత్‌ నుంచి అమెరికాకు వెళ్తున్న ఆర్డర్లు 40-50 శాతం వరకు తగ్గిపోవచ్చని వస్త్ర పరిశ్రమ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దాంతో రంగానికి 4-5 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

వివరాలు 

ప్రధాన ఎగుమతిదారుల ఆందోళన 

భారతదేశంలో వెల్‌స్పన్‌ లివింగ్‌,గోకల్‌దాస్‌ ఎక్స్‌పోర్ట్స్‌, ఇండోకౌంట్‌,ట్రైడెంట్‌ వంటి ప్రముఖ టెక్స్‌టైల్‌ ఎగుమతిదారు సంస్థలు తమ మొత్తం విక్రయాల్లో 40-70 శాతం ఉత్పత్తులను అమెరికాకు పంపిస్తున్నాయి. తాజా సుంకాల పెంపు వల్ల అమెరికా నుంచి వచ్చే ఆర్డర్లు గణనీయంగా తగ్గిపోతాయనే ఆందోళన ఎగుమతిదారుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు అమెరికా,భారతీయ దుస్తులు,ఫ్యాషన్‌ ఉత్పత్తులలో అతిపెద్ద దిగుమతిదారుగా కొనసాగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగంలో భారత్‌ నుంచి 36.61 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరగగా, వాటిలో 28 శాతం అమెరికాకే చేరాయి. బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలపై 20 శాతం సుంకాలు మాత్రమే ఉండటం వల్ల, అమెరికా సంస్థలు టెక్స్‌టైల్‌ ఉత్పత్తుల కోసం ప్రత్యామ్నాయ దేశాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

వివరాలు 

రష్యా చమురు కొనుగోలు - సుంకాల కారణం 

రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగిస్తున్నందుకు ప్రతిగా భారత్‌పై ట్రంప్‌ సుంకాలు విధించిన విషయం తెలిసిందే. గతంలో ఆయన 25 శాతం టారిఫ్‌లను విధించగా, తాజాగా వాటిని 50 శాతానికి పెంచారు. మొదటగా ప్రకటించిన 25 శాతం సుంకాలు ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్తగా పెంచిన అదనపు సుంకాలు ఈ నెల 27 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్‌ ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రభావం భారతీయ వస్త్ర పరిశ్రమతో పాటు ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై తక్షణమే పడనుంది.