
GST revamp: దీపావళికి వచ్చే GST సవరణ నుండి మనం ఏమి ఆశించవచ్చు? కార్లు, మొబైల్స్ చౌకగా లభిస్తాయా?
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో జీఎస్టీ (GST) వ్యవస్థలో భారీ మార్పులు రాబోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలిచ్చారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి ప్రసంగించిన ఆయన.."ఈసారి మీకు డబుల్ దీపావళి కానుక ఇస్తాం. దేశవ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గించే నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రీఫార్మ్స్ తీసుకువస్తున్నాం. దీపావళికి ముందే ఇది మీకు బహుమతిగా అందుతుంది" అని ప్రకటించారు.
వివరాలు
సాధారణ ప్రజలకు ఉపశమనం
ఈ సంస్కరణలతో రైతులు, మధ్యతరగతి, చిన్న వ్యాపారవేత్తలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇది రాజకీయంగా కూడా బీజేపీకి ప్లస్‌గా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగం అంశంపై దాడి చేస్తున్న ప్రతిపక్షానికి ఇది సమాధానమని అంటున్నారు. అంతేకాదు, వాషింగ్టన్‌తో వాణిజ్య వివాదాల్లోనూ మోదీ ప్రతిష్ఠను పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు. మార్కెట్లలో సానుకూల ప్రభావం మోదీ ప్రకటనతో షేర్ మార్కెట్లూ ఉత్సాహంగా స్పందించాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1,021 పాయింట్లు ఎగిసి 81,619 వద్దకు చేరింది. నిఫ్టీ 322 పాయింట్లు ఎగబాకి 24,953 వద్ద నిలిచింది.
వివరాలు
ప్రస్తుతం జీఎస్టీ రేట్లు
ప్రస్తుతం దేశంలో జీఎస్టీ నాలుగు స్లాబులుగా ఉంది. 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం. వీటికి తోడు బంగారం, వెండి, వజ్రాలపై ప్రత్యేక రేట్లు కూడా అమల్లో ఉన్నాయి. అవసరమైన ఆహార పదార్థాలు, ఔషధాలు, విద్యపై మాత్రం జీఎస్టీ 0 శాతం. రాబోయే మార్పులు సర్కార్ ప్రణాళిక ప్రకారం నాలుగు స్లాబుల బదులుగా రెండు ప్రధాన స్లాబులు మాత్రమే ఉండేలా మారుస్తున్నారు. 5 శాతం,18 శాతం. లగ్జరీ, సిగరెట్ల వంటి 'సిన్ గూడ్స్' కోసం ప్రత్యేకంగా 40శాతం స్లాబ్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం 28 శాతం ఉన్న వస్తువుల 90శాతం 18శాతం కిందకి వస్తాయి.అలాగే 12శాతం స్లాబ్‌లో ఉన్నవి ఎక్కువగా 5 శాతం కిందకి మారతాయి.
వివరాలు
చౌకగా మరేవి ఏవి?
టూత్‌పౌడర్, పేస్ట్, సబ్బులు, హెయిర్ ఆయిల్, ప్రాసెస్‌డ్ ఫుడ్స్, స్నాక్స్, ఫ్రోజన్ వెజిటబుల్స్, కండెన్స్డ్ మిల్క్ వంటి ఉత్పత్తులు చౌక అవుతాయి. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ప్రెషర్ కుకర్లు, గీజర్లు, ఇనుప పరికరాలు, వాక్యూమ్ క్లీనర్లు కూడా తక్కువ ధరలో లభిస్తాయి. రెడీమేడ్ దుస్తులు, చెప్పులు, వంట పాత్రలు, ఆయుర్వేద ఔషధాలు, ఎయిర్ కండీషనర్ల ధరలు కూడా తగ్గే అవకాశముంది. ఆరోగ్య, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియాలపై కూడా జీఎస్టీ 18% నుంచి 5% లేదా 0% కి తగ్గించవచ్చని సమాచారం. చిన్న కార్లపై పన్ను తగ్గే అవకాశం ఉంది.
వివరాలు
ఏం ఖరీదవుతాయి?
పొగాకు ఉత్పత్తులు (సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా మొదలైనవి)పై 40% జీఎస్టీ విధించే అవకాశముంది. ఆన్‌లైన్ గేమింగ్ కూడా 28% నుంచి 40%కి పెరగనుంది. దీని వల్ల ఫాంటసీ స్పోర్ట్స్ వంటి ప్లాట్‌ఫార్ములకు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. ప్రారంభంలో ప్రభుత్వానికి ఆదాయంలో కొంత తగ్గుదల ఉండవచ్చు. అయితే పన్ను రేట్లు తగ్గడం వల్ల వినియోగం పెరిగి, తర్వాతి నెలల్లో ఆదాయం సమతుల్యం అవుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే ప్యాకేజ్డ్, అన్‌ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై ఉన్న కన్ఫ్యూజన్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇప్పుడు అందరి చూపు దీపావళి వైపే. జీఎస్టీ కౌన్సిల్ ఏ మార్పులు ప్రకటిస్తుంది.. ఇది నిజంగా "దీపావళి ధమాకా" అవుతుందా అన్నది చూడాలి?