India-Canada: దిగజారుతున్న భారత్-కెనడా దౌత్య సంబంధాలు.. వ్యాపార సంబంధాలను దెబ్బతీస్తాయా?
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాపులారిటీ అక్కడ రోజురోజుకు తగ్గిపోతోంది. మరోవైపు, కొందరు ఎంపీలు ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఆయన సిక్కుల , సిక్కు ఎంపీల మద్దతు పొందేందుకు ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను ముందుకు తెచ్చారు. ఈ కేసులో కెనడాలోని భారత అగ్రశ్రేణి దౌత్యవేత్తల ప్రమేయం ఉన్నట్లు ఆరోపించడంతో, రెండు దేశాల మధ్య దౌత్యయుద్ధం ప్రారంభమైంది. భారత్ ఇప్పటికే కెనడాలోని ఆరుగురు దౌత్యవేత్తలను ఉపసంహరించగా, కెనడా కూడా భారత్‌లోని తమ ఆరుగురు దౌత్యవేత్తలను వెనక్కి పిలవాలని కేంద్రం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
దౌత్యయుద్ధం వాణిజ్య యుద్ధంగా మారుతుందా..
ఈ పరిణామాలు కెనడాకు ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత్ ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఊహించలేదని, ఆయన సిక్కు ఓటర్ల మద్దతు కోసం ఎత్తుగడ వేసినప్పటికీ, ఇంత తీవ్రతైన చర్యలను ఎదుర్కోవడం కెనడాకు ఆశ్చర్యంగా మారింది. ఇప్పుడు ఈ దౌత్యయుద్ధం వాణిజ్య యుద్ధంగా మారుతుందా అనే ఆందోళన ట్రూడోలో మొదలైంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య 8.3 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది.ఇందులో, కెనడా నుంచి భారత దిగుమతులు 4.6 బిలియన్లు,మన దేశం నుంచి కెనడాకు ఎగుమతులు 3.8 బిలియన్ డాలర్లు ఉన్నాయి.
కెనడా, భారతదేశానికి అత్యధిక రిమిటెన్స్‌లు పంపుతున్న దేశాలలో ఒకటి
కానీ,ఈ వాణిజ్య సంబంధాలు దెబ్బతింటే భారత్‌కి పెద్ద నష్టం ఉండకపోవచ్చు. వేరే దేశాల నుంచి దిగుమతులు చేసుకోవచ్చు, కానీ 140 కోట్ల జనాభా ఉన్న భారత మార్కెట్‌ను కోల్పోవడం కెనడాకు చాలా నష్టమవుతుంది. అంతేకాకుండా, కెనడియన్ పెన్షన్ ఫండ్స్, అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థలో కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టాయి. ఈ పరిణామాలను పెట్టుబడిదారులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.కెనడా, భారతదేశానికి అత్యధిక రిమిటెన్స్‌లు పంపుతున్న దేశాలలో ఒకటి. 2020-21 నుండి 2022-23 వరకు కెనడా, భారతదేశంలో 3.31 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో 18వ అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా ఉంది.
CPPIB భారతదేశ పెట్టుబడులు 14.8 బిలియన్ డాలర్లు
కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ (CPPIB) భారతదేశంలో కోటక్ మహీంద్రా, పేటీఎం, జొమాటో వంటి కంపెనీల్లో గణనీయమైన వాటాలను కలిగి ఉంది. 2023 నాటికి, CPPIB భారతదేశ పెట్టుబడులు 14.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2023లో భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా 125 బిలియన్ డాలర్ల రిమిటెన్స్‌లు వచ్చాయి, ఇందులో కెనడాలోని భారతీయుల పాత్ర కూడా ఉంది. ఈ పరిస్థితులు, ఈ పెట్టుబడులు, రిమిటెన్స్‌లపై ప్రభావం చూపుతాయా అనే ఆందోళన కెనడాలో వ్యక్తమవుతోంది. ఇన్వెస్టర్లు, ఈ పరిణామాలు తక్కువ ప్రభావం చూపుతాయని భావిస్తున్నప్పటికీ, ఇది కెనడా-భారత్ వాణిజ్య సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.