LOADING...
Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్ ఆరోగ్యంపై అప్‌డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి
పవన్‌ కళ్యాణ్ ఆరోగ్యంపై అప్‌డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్ ఆరోగ్యంపై అప్‌డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

వ్రాసిన వారు Moogati Shabari
Apr 19, 2026
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అన్న, ప్రముఖ నటుడు చిరంజీవి స్పందిస్తూ కీలక సమాచారం పంచుకున్నారు. పవన్‌ ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ''కల్యాణ్‌ బాబుకు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. క్రమంగా కోలుకుంటున్నారు. పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోవడానికి సుమారు వారం రోజులు పట్టవచ్చని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు'' అంటూ చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

వివరాలు

ఫోన్ చేసిన ప్రధాని మోడీ..

ఇదే సమయంలో సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా పవన్‌ ఆరోగ్యంపై స్పందించారు. అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ తదితరులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తమ సందేశాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. శుక్రవారం ఉదయం అధికారులతో పరిపాలనా అంశాలపై చర్చిస్తున్న సమయంలో పవన్‌ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఆయనను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సూచన మేరకు శనివారం సాయంత్రం శస్త్రచికిత్స చేపట్టారు. అనంతరం కనీసం పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇక పవన్‌ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా సమాచారం తెలుసుకున్నారు. ఫోన్‌ ద్వారా ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement