LOADING...
Betting Apps Case: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్‌రాజ్‌.. 
బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్‌రాజ్‌..

Betting Apps Case: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్‌రాజ్‌.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

బెట్టింగ్ యాప్స్ కేసులో ఈన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే కొందరు ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. తాజాగా నటులు దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మిలకు ఈడీ సమన్లు పంపింది. ఈ క్రమంలో, నటుడు ప్రకాశ్ రాజ్ ఇప్పటికే ఈడీ ఎదుట హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ తన దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిగే మనీలాండరింగ్, హవాలా లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. మొత్తం 36 బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో పాల్గొన్న సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

వివరాలు 

రానా,లక్ష్మి కి కూడా ఈడీ నోటీసులు

ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ఒక బెట్టింగ్ యాడ్‌లో నటించారని, అందువల్ల ఆయనపై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది. దాదాపు 10 రోజుల క్రితమే ఆయనకు ఈడీ నోటీసులు పంపగా, తాజాగా విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, మనీలాండరింగ్ కేసులో టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 23న రానాను, 30న ప్రకాశ్ రాజ్‌ను, ఆగస్టు 13న మంచు లక్ష్మిని విచారణకు హాజరు కావాలని సమన్లు పంపారు.

వివరాలు 

29 మంది వ్యక్తులపై దర్యాప్తు

ఈ కేసుకు సంబంధించి టాలీవుడ్ సెలబ్రిటీలకు ఇచ్చిన నోటీసుల్లో, వారు చేసిన ఒప్పందాలు, ప్రమోషన్‌కు సంబంధించిన వివరాలు, అలాగే వారి బ్యాంక్ ఖాతాల సమాచారం తీసుకురావాలని సూచించారు. ఇందులో భాగంగా మరికొంతమంది సినీ నటీనటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు దశలవారీగా సమన్లు ఇవ్వనున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంలో మొత్తం 29 మంది వ్యక్తులపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. వీరిలో టాలీవుడ్ నటీనటులు, కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబ్ ప్రముఖులు ఉన్నారు. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, విశాఖపట్నం పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.

వివరాలు 

వివరాల  ఆధారంగా  ఈడీ  ECIR నమోదు 

తెలంగాణ రాష్ట్రంలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రభావంతో పలువురు యువతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ యాప్స్‌ను నిర్భయంగా ప్రమోట్ చేయడం వల్ల ప్రజలు వాటి పట్ల ఆకర్షితులై, భారీగా డబ్బులు పెట్టి నష్టపోయారు. కొందరైతే లక్షలాది రూపాయలు కోల్పోయారు. దీంతో ఈ యాప్స్‌ను ప్రచారం చేసిన సినీ ప్రముఖులు, యూట్యూబ్ ప్రముఖులపై ఈడీ కేసులు నమోదు చేసింది. ఈడీ నిర్వహించిన దర్యాప్తులో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం ద్వారా కోట్లాది రూపాయలు లావాదేవీ జరిగినట్లు గుర్తించింది. ఈ వివరాలపై ఆధారంగా ఈడీ ECIR (Enforcement Case Information Report) నమోదు చేసింది. దీనితో పాటు మనీలాండరింగ్ కోణంలోనూ గట్టిగా విచారణ కొనసాగుతోంది.