Page Loader
Coolie : కూలీ తెలుగు రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ 
కూలీ తెలుగు రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

Coolie : కూలీ తెలుగు రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 09, 2025
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ్ మెగా స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కూలీ'. ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో అక్కినేని నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, అలాగే కట్టప్ప పాత్రతో గుర్తింపు పొందిన సత్యరాజ్ వంటి పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల‌ను ప్రారంభిస్తూ, "చికిటు" అంటూ మొదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.

వివరాలు 

తెలుగు హక్కులను రూ. 45 కోట్లకు సొంతం చేసుకున్న ఆసియన్ సురేష్

తెలుగు మార్కెట్‌లో కూడా ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు హక్కులను ఆసియన్ సురేష్ సుమారు రూ. 45 కోట్లకు సొంతం చేసుకున్నట్టు సమాచారం. అయితే, తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు భారీ ఓపెనింగ్ రావాలంటే ప్రస్తుతం ఉన్న క్రేజ్ మాత్రమే సరిపోదు. అందుకే స్వయంగా రజనీకాంత్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 7న నిర్వహించనున్నట్టు పంపిణీదారులు ఖరారు చేశారు.

వివరాలు 

 రెండవ లిరికల్ సాంగ్‌ విడుదల 

ఈ ప్రీ రిలీజ్ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్, అలాగే నటుడు అక్కినేని నాగార్జున హాజరయ్యే అవకాశం ఉంది. అంతేకాక, ఈ వారం రెండవ లిరికల్ సాంగ్‌ను విడుదల చేయాలనే యోచనలో చిత్రబృందం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పాటలో అక్కినేని నాగార్జున.. పూజ హెగ్డే జంటగా కనిపించనున్నారు. ఈ పాటకు సంగీత దర్శకుడు అనిరుద్ ఒక ప్రత్యేకమైన ట్యూన్ అందించినట్టు ఫిలింనగర్ టాక్. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా, 'వార్ 2' సినిమాతో పోటీగా బరిలోకి దిగుతోంది. అయితే, కూలీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్లు రాబడుతుందో చూడాల్సిందే.