Page Loader
Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం.. హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ 2026లో స్థానం..  తొలి భారతీయ నటిగా రికార్డు  
దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం.. హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ 2026లో స్థానం.. తొలి భారతీయ నటిగా రికార్డు

Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం.. హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ 2026లో స్థానం..  తొలి భారతీయ నటిగా రికార్డు  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

భాషా అడ్డంకులు లేకుండా తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న ప్రముఖ నటి దీపికా పదుకొణె తాజాగా అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు పొందారు. ఆమెకు 2026 హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ స్టార్‌ గౌరవం దక్కనుంది. ఈ మేరకు హాలీవుడ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. మోషన్‌ పిక్చర్స్‌ విభాగంలో ఈ గౌరవాన్ని పొందిన తొలి భారతీయ నటి దీపిక కావడం విశేషం. చాంబర్‌ తాజాగా ప్రకటించిన జాబితాలో దీపికతో పాటు డెమి మూర్‌,రాచెల్‌ మెక్‌ఆడమ్స్‌,ఎమిలీ బ్లంట్‌ వంటి ప్రముఖ హాలీవుడ్‌ నటీనటుల పేర్లు ఉన్నాయి. ఈ ప్రకటనా నేపథ్యంలో దీపిక అభిమానులు ఆనందిస్తున్నారు.

వివరాలు 

'100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌' జాబితాలో దీపిక

మొత్తం 35 మందిని 2026 వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ స్టార్‌కు ఎంపిక చేసినట్లు చాంబర్‌ తెలిపింది. వీరందరికీ వినోదరంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది. నటన మాత్రమే కాదు, ఆమె మాట్లాడే తీరు, స్పీచ్‌లు కూడా ప్రజలను ఆకట్టుకుంటూ ఉంటాయి. 2018లో ప్రపంచప్రఖ్యాత టైమ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన '100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌' జాబితాలో దీపికకు స్థానం లభించింది. అదే విధంగా 2022లో జరిగిన ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రధాన పాత్ర పోషించి ప్రపంచవ్యాప్తంగా తనకున్న గుర్తింపును మరింత పెంచుకున్నారు.

వివరాలు 

'రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌' సినిమాతో హాలీవుడ్‌లో..

2023లో ఆస్కార్‌ అవార్డు వేడుకలో భాగంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలోని 'నాటు నాటు' పాటను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వేదికపై సందడి చేశారు. "డు యూ నో నాటు? ఇప్పుడు మీకు తెలుస్తుంది.. ఇది ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం నుంచి 'నాటు నాటు'.." అంటూ దీపిక చేసిన పరిచయంతో అంతటా హర్షధ్వానాలు వినిపించాయి. ఆ ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.నటిగా తన ప్రయాణాన్ని 2006లో ప్రారంభించిన దీపిక,2017లో 'రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌' సినిమాతో హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో కలిసి ఒక బహుభాషా చిత్రంలో శక్తిమంతమైన యోధురాలిగా,యాక్షన్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈప్రాజెక్టు తర్వాత 'కల్కి 2898 AD 'చిత్రానికి సీక్వెల్‌ రూపంలో రూపొందుతున్న సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారు.