Page Loader
#NewsBytesExplainer: తెలుగు సినిమాల రీ-రిలీజ్‌లలో హీరోల పరువు తీసేలా అభిమానుల ఉన్మాదం ?
తెలుగు సినిమాల రీ-రిలీజ్‌లలో హీరోల పరువు తీసేలా అభిమానుల ఉన్మాదం ?

#NewsBytesExplainer: తెలుగు సినిమాల రీ-రిలీజ్‌లలో హీరోల పరువు తీసేలా అభిమానుల ఉన్మాదం ?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2025
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు ప్రేక్షకులకు సినిమా అనేది ఒక వినోదం కాదు,అది ఓ భావోద్వేగం. సినిమా అనేది కేవలం ఒక కాలక్షేపంగా మాత్రమే కాకుండా థియేటర్‌లో ఆ సినిమా చూసిన అనుభవాన్ని జీవితకాలం దాచుకుంటాడు. సాధారణ ప్రేక్షకుడికే అలా అయితే, అభిమానుల పరిస్థితి చెప్పక్కర్లేదు. వారెప్పుడు తమ ఇష్టమైన నటుడు లేదా దర్శకుడి సినిమాను చూసారో, ఆ అనుభవాన్ని తరువాతి తరం పిల్లలకు చెప్పాలనిపిస్తుంది. ముఖ్యంగా ఒక స్కూల్ విద్యార్థిగా చూసిన సినిమా తను ఉద్యోగం చేసే సమయంలో మళ్లీ థియేటర్లో రీ రిలీజ్ అయితే, ఆ అనుభవాన్నితిరిగి ఆస్వాదించాలన్న తపనతో సెలవు తీసుకుని థియేటర్‌కు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి అనుభూతులే రీ-రిలీజ్ ట్రెండ్‌కి కారణం అవుతన్నాయి.

వివరాలు 

అతి చేస్తూ హద్దులు చెరిపేస్తున్న ఉన్మాదం 

కానీ కొంతమంది అభిమానుల మితిమీరిన ప్రవర్తన వల్ల థియేటర్ల యజమానులు ఇప్పుడు ఈ ట్రెండ్‌కి భయపడే పరిస్థితిలో ఉన్నారు. అభిమానులు చేసే హంగామా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సాధారణ ప్రేక్షకుల్లో అసహ్యం కలుగుతోంది. ఇటీవల 'ఖలేజా' రీ-రిలీజ్ సందర్భంగా ఓ అభిమాని బతికి ఉన్న పామును థియేటర్‌కి తీసుకొచ్చి అందరినీ షాక్‌కి గురిచేశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జాతీయ మీడియా సైతం దీనిపై కథనాలు ప్రసారం చేసింది.. 'సింహాద్రి' సినిమా రీ-రిలీజ్ సమయంలోనూ అభిమానుల అత్యుత్సాహం కారణంగా ఒక థియేటర్లో మంటలు చెలరేగాయి. అలాగే 'దేశముదురు' రీ-రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లో ఒక థియేటర్‌లో చిచ్చుబుడ్డి వెలిగించడంతో పోలీసులు సినిమా ప్రదర్శనను నిలిపివేయాల్సి వచ్చింది.

వివరాలు 

సినిమా కోసమే కాదు - హంగామా కోసమే వస్తున్నారా? 

కొందరు థియేటర్లలో వివాహ దృశ్యానికి అనుగుణంగా నిజంగానే పెళ్లి చేసుకునే తతంగాలు కూడా జరుగుతున్నాయి. ఇదంతా ఒక నటుడి అభిమానుల్లో మాత్రమే పరిమితమైన విషయం కాదు.ప్రతి హీరో అభిమానుల నుంచీ ఇలాంటి హెచ్చులు కనిపిస్తున్నాయి. ఒక హైస్కూల్ విద్యార్థి తన అభిమాన హీరో సినిమా మొదటి రోజు చూడాలంటే డబ్బు లేక తల్లిదండ్రులను బతిమాలుకోవాల్సి వస్తుంది. అదే సినిమా తన ఉద్యోగ కాలంలో రీ రిలీజ్ అయితే, చిన్ననాటి జ్ఞాపకాలను తిరిగి పొందాలన్న ఆసక్తితో,ఆ సినిమా యూట్యూబ్‌లో ఉన్నా కూడా థియేటర్‌కే వెళ్తాడు. అలాగే కొన్ని జంటలు పెళ్లి తరువాత కలిసి చూసిన తొలి సినిమా మళ్లీ రిలీజ్ అయితే, ఆ అనుభూతిని తిరిగి అనుభూతిని ఆస్వాదించడం కోసం ఉత్సాహంతో థియేటర్‌కి వెళ్తారు.

వివరాలు 

ఓనర్లకు నష్టమే ఎక్కువ... 

కానీ కొంతమంది అభిమానులు చేస్తున్న అతి చర్యల వల్ల, నిజంగా సినిమా ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులకు ఆ అవకాశం లేకుండా పోతోందని వాళ్లు వాపోతున్నారు. థియేటర్ యజమానులు అభిమానుల అల్లర్లు వల్ల సినిమా ద్వారా వచ్చే అద్దె కంటే ఎక్కువగా ఖర్చు సీట్ల మరమ్మతులకూ, స్క్రీన్‌ల మరమ్మతులకూ పోతుందని వాపోతున్నారు. నిజంగా కొందరు అభిమానులు సినిమాను ఎంజాయ్ చేయడం కన్నా, హంగామా చేయడానికే వస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

ఓనర్లకు నష్టమే ఎక్కువ... 

ఈ పరిస్థితి కేవలం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. తమిళనాడులో ఇటీవల ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీని ప్రభావంగా, అక్కడి ప్రేక్షకులు కూడా రీ-రిలీజ్ సినిమాలకు వెళ్ళడంలో వెనుకంజ వేస్తున్నారు. నిర్మాతలు, థియేటర్ యజమానులు అభిమానులను కోరుతున్నదేమంటే - ఇలాంటి మితిమీరిన కార్యకలాపాలను నియంత్రించి, కుటుంబాలతో వచ్చిన సాధారణ ప్రేక్షకులకు సురక్షితంగా సినిమాను ఆస్వాదించే అవకాశం కల్పించాలి. అప్పుడు రీ-రిలీజ్ ట్రెండ్ మరింత పెద్ద విజయం అవుతుందనడంలో సందేహం లేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'ఖలేజా' రీరిలీజ్ సందర్భంగా బ్రతుకున్న పాముతో  అభిమాని హల్చల్