OTT Platforms: రణవీర్ అల్హాబాదియా వ్యాఖ్యల నేపథ్యంలో.. ఓటీటీలకు కేంద్రం హెచ్చరికలు జారీ
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియాస్ గాట్ లాటెంట్ (IGL) కార్యక్రమంలో రణ్‌వీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఈ నేపథ్యంలో,2021 ఐటీ నిబంధనల్లోని కోడ్ ఆఫ్ ఎథిక్స్‌ను ఓటీటీ ప్లాట్‌ఫారాలు, సామాజిక మాధ్యమాలు తప్పనిసరిగా అనుసరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.
చిన్నారులకు 'ఎ' రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసింది.
గురువారం, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
''ఓటీటీ ప్లాట్‌ఫామ్స్,సామాజిక మాధ్యమాల్లో అశ్లీల,అసభ్యకరమైన కంటెంట్‌పై అనేక ఫిర్యాదులు అందాయి.2021 ఐటీ నిబంధనల ప్రకారం,కోడ్ ఆఫ్ ఎథిక్స్‌ను పాటించటం అనివార్యం.వయస్సుకు అనుగుణమైన కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండాలి.స్వీయ నియంత్రణ వ్యవస్థను కలిగి ఉండే ఓటీటీలు నైతిక విలువలను పాటించాలి''అని ఆ ప్రకటనలో వివరించారు.
వివరాలు
కేంద్రానికి సుప్రీం నోటీసులు
ఐజీఎల్‌లో పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రుల గురించి,శృంగారం పై ప్రశ్నించడంతో ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాపై తీవ్రమైన నిరసనలు వ్యక్తమయ్యాయి.
అతడి వ్యాఖ్యలపై పలువురు పార్లమెంట్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
సమయ్ రైనా షోలో రణ్‌వీర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనికి సంబంధించిన పలు రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో,రణ్‌వీర్ అల్హాబాదియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తనపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఒకే కేసుగా చూడాలని పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా, సుప్రీంకోర్టు రణ్‌వీర్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో,సామాజిక మాధ్యమాల్లో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించేందుకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
దీనిపై స్పష్టతనివ్వాలని కేంద్రానికి నోటీసులు కూడా జారీ చేసింది.