Jr NTR: పెద్ద మనసు చాటుకున్న జూనియర్ ఎన్టీఆర్..తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి విరాళం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలో వరద బాధితులకు అండగా నిలిచేందుకు టాలీవుడ్ ముందుకొస్తోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు తన వంతుగా రూ. కోటి సాయం ప్రకటించాడు. ఈ రెండు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని సెప్టెంబర్ 3న తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల సృష్టించిన వరద భీభత్సం తనను ఎంతగానో కలచివేసిందని, త్వరలోనే ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని ఎన్టీఆర్ కోరారు.
ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విశ్వక్ సేన్
తారక్ సాయం ప్రకటించిన కొద్దిసేపటికే యువ నటుడు విశ్వక్సేన్ కూడా తన వంతు విరాళాన్ని ప్రకటించాడు. తారక్ ను ఎంతో అభిమానించే విశ్వక్సేన్, అతని బాటలోనే సాయం అందించేందుకు ముందుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెరో రూ. 5 లక్షల విరాళం ఇస్తున్నట్లు విశ్వక్‌సేన్ తన ఎక్స్ ద్వారా వెల్లడించాడు. ఇక, "కల్కి 2898AD." మూవీ టీమ్ కూడా రూ. 25 లక్షల విరాళం ప్రకటించింది. కష్ట సమయంలో టాలీవుడ్ అండగా నిలుస్తున్న టాలీవుడ్ స్టార్లకు సోషల్ మీడియా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.