Mahesh Babu: 'హాలీవుడ్ హీరోలకు తీసిపోని హాండ్సమ్ పర్సనాలిటీ'.. హ్యాపీ బర్తడే మహేష్ బాబు
సూపర్ స్టార్ కృష్ట తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. కొద్ది కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తన నటనతో తండ్రి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. మహేష్ బాబు ఇవాళ 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు. బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత సూపర్ స్టార్‌గా టాలీవుడ్ లో అగ్రహీరోగా ఎదగాడు.
నాలుగేళ్ల వయస్సులోనే వెండితెరపై కనిపించిన మహేష్
నాలుగేళ్ల వయస్సులో ముఖానికి రంగేసుకున్న మహేష్ బాబు.. ఇప్పటికీ అదే దూకుడుతో ముందుకెళ్తున్నాడు. తన సింపుల్ స్మైల్‌తో ఇప్పటికీ అమ్మాయిల మనసును దోచేస్తున్నాడు. 'ప్రిన్స్' గా 'సూపర్ స్టార్' గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నాడు. ఆయనకు ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే.. వయస్సు పెరిగే కొద్దీ మరింత హ్యాండ్సమ్ గా మారిపోతున్నాడు. ఈ క్రమంలో మహేష్ బాబు గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం
తండ్రితో కలిసి పలు సినిమాల్లో నటించిన మహేష్
మహేష్ బాబు 1975 ఆగస్టు 9న చైన్నైలో హీరో కృష్ణ, ఇందిర దంపతులకు జన్మించారు. తండ్రి హీరో కావడంతో నాలుగేళ్ల వయస్సులో 'నీడ' చిత్రంలో తొలిసారిగా వెండితెరపై కనిపించాడు. తర్వాత తండ్రి నటించిన పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగానూ నటించాడు. 'ముగ్గురు కొడుకులు', 'బజారు రౌడీ', 'శంఖారావం''గూఢచారి 117', 'కొడుకు దిద్దిన కాపురం', 'అన్న-తమ్ముడు', 'బాలచంద్రుడు' వంటి చిత్రాలతో అలరించాడు. తర్వాత కొన్నాళ్లు పాటు సినిమాలకు దూరంగా ఉంటూ చదువుకున్నాడు.
మురారితో సూపర్ హిట్ అందుకున్న మహేష్
మహేష్ బాబు పూర్తి స్థాయి హీరోగా నటించిన తొలి చిత్రం రాజకుమారుడు. ఈ మూవీలో నటుడిగా మంచి మార్కులే కొట్టేశాడు. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు అశించిన స్థాయిలో ఆడలేదు. ఇక కృష్ణవంశీ డైరక్షన్‌లో వచ్చిన మురారి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తర్వాత టక్కరి దొంగ, ఒక్కడు సినిమాతో మాస్ ప్రేక్షకుల్లో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. 'నిజం' చిత్రంతో నంది అవార్డును దక్కించుకున్నాడు. అతడు సినిమా బ్లాక్ బాస్టర్ కావడంతో మహేష్ నటనకు రెండో సారి నంది అవార్డు లభించింది.
పోకరితో ఇండస్ట్రీ రికార్డు బద్దలు
2006లో వచ్చిన 'పోకిరి' సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పటికే ఉన్న పాత రికార్డులను చెరిపేసి కొత్త రికార్డులను సృష్టించింది. 'సైనికుడు', 'అతిథి', 'ఖలేజా' వంటి చిత్రాలు నిరాశపరచడంతో ఐదేళ్ల వరకు మహేష్ ఖాతాలో హిట్ పడలేదు. ఆ తర్వాత వచ్చిన దూకుడు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. 'బిజినెస్ మ్యాన్', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలు విజయం సాధించగా, 'నేనొక్కడినే' చిత్రం పరాజయం పాలైంది. అయితే 'ఆగడు', 'బ్రహ్మోత్సవం', 'స్పైడర్' సినిమాలు మాత్రం గట్టి దెబ్బ కొట్టాడు.
మహేష్ బాబు ఖాతాలో ఎనిమిది నంది అవార్డులు
'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను', సర్కారి వారి పాట సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' ఫర్వాలేదనిపించింది. ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది పురస్కారాలను 8 సార్లు అందుకున్నారు. అలానే 5 ఫిలిం ఫేర్ అవార్డులతో పాటుగా, నాలుగు సైమా అవార్డులు దక్కించుకున్నారు. ఇవే కాకుండా జీ సినీ అవార్డ్స్, ఐఫా ఉత్సవం లాంటి మరికొన్ని పురస్కారాలు మహేష్ ఖాతాలో ఉన్నాయి. ప్రభాస్ తర్వాత మేడమ్ టుస్సాడ్స్‌లో స్థానం సంపాదించుకున్న టాలీవుడ్ హీరోగా మహేష్ బాబు అరుదైన ఘనత సాధించారు.