ఇండియా జాయ్ సినిమాటిక్ ఎక్స్‌పోలో నాగార్జున, నాగ్ అశ్విన్.. ఎవరెవరు ఏమన్నారో తెలుసా
హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో జరిగింది. దీనికి సినీ రంగంలోని 24 ఫ్రేమ్స్ కి సరికొత్త సాంకేతికతను తెలియజేసే పరిచయ వేదికగా సినిమాటిక్ ఎక్స్ పో పేరు పొందింది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్, Vfx, స్పెషల్ ఎఫ్టెక్స్ రంగాలకు చెందిన ఆధునిక టెక్నాలజీని పరిచయం చేశారు. రోజురోజుకూ సాంకేతికంగా చాలా మార్పులు వస్తున్నాయని నాగార్జున అన్నారు. 1974లో అన్నపూర్ణ స్టూడియోను ప్రారంభించామని, నెలకో షూటింగ్ జరిగితే చాలనుకున్నామన్నారు. భారతీయ సినిమా పరిశ్రమకు హైదరాబాద్ రాజధానిలా మారనుందని, ఈ మేరకు దక్షిణాది పరిశ్రమలనే ఇండియా ఫాలో అవుతోందన్నారు. గేమింగ్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి అన్నపూర్ణ కాలేజ్‌లోనూ కోర్సులున్నాయన్నారు.
వచ్చే సినిమాని ఇక్కడి వాళ్లతోనే తీస్తా : నాగ్ అశ్విన్
తాను కూడా యానిమేషన్ కోర్సులు నేర్చుకున్నానన్న డైరెక్టర్ నాగ్ అశ్విన్, వీఎఫ్‌ఎక్స్ కంపెనీల చుట్టూ కథలతో పట్టుకెళ్లానన్నారు. హాలీవుడ్ వంటి నాణ్యతతో మూవీలు ఎందుకు చేయరని అడుగుతుంటారని, గత 10 ఏళ్లుగా మంచి నాణ్యతతో చిత్రాలు తీస్తున్నామన్నారు. ఇప్పుడు హాలీవుడ్ వాళ్లే ఇక్కడకు వచ్చి సినిమాలు చేస్తున్నారని, వచ్చే సినిమాని ఇక్కడి వాళ్లతోనే హాలీవుడ్ కంటే అత్యుత్తమ క్వాలిటీతో తీస్తాన్నారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు యానిమేషన్, గేమింగ్ ఆశించిన మేర అభివృద్ది కాలేదని, ఇప్పుడు ఆ ఇండస్ట్రీని ఈ స్థాయికి తీసుకొచ్చామని తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. కొత్త విధానాలతో 2016లో తీసుకొచ్చిన పాలసీ ఈ మేరకు దోహదపడిందన్నారు. దేశంలో ఎన్ని పాలసీలున్నా, స్థానికంగా పాలసీలను ఆచరణలోకి తీసుకొచ్చామన్నారు.