Jana nayagan: 'జననాయగన్' ఒక్కటే కాదు.. విడుదలకు ముందే లీకైన సినిమాలివే
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా తయారీ అంటే వందలాది మంది కృషి కలయిక. అలాంటి సినిమా థియేటర్లలోకి రాకముందే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైతే, నిర్మాతలు, నటీనటులకు అది పెద్ద దెబ్బగా మారుతుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్. ఎన్నో కష్టాల మధ్య రూపొందిన ఈ చిత్రానికి చెందిన కొన్ని సన్నివేశాలు ముందుగానే లీక్ కావడంతో, కొంతమంది వాటిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఈ సినిమా మళ్లీ చర్చనీయాంశమైంది. అయితే 'జననాయగన్' మాత్రమే కాదు, గతంలో కూడా పలు చిత్రాలు విడుదలకు ముందే లీక్ అయిన సంఘటనలు ఉన్నాయి. వాటి గురించి ఒకసారి చూద్దాం.
వివరాలు
జననాయగన్
విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'జననాయగన్' చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఏప్రిల్ 10న ఆన్‌లైన్‌లో కనిపించాయి. సీబీఎఫ్‌సీ సర్టిఫికేషన్ ఇంకా పొందని ఈ సినిమా నుంచి దాదాపు ఐదు నిమిషాల ఫుటేజ్‌తో పాటు ఒక పాట కూడా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన చిత్ర బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సికిందర్ (2025) : సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో, మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన 'సికిందర్' సినిమా విడుదలకు ముందే అధిక నాణ్యత గల ప్రింట్ రూపంలో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది.
వివరాలు
లీక్ అయిన మరికొన్ని సినిమాలివే..
ఉడ్తా పంజాబ్ (2016) : షాహిద్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్, నటించిన 'ఉడ్తా పంజాబ్' 40 నిమిషాల సన్నివేశాలు విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ చిత్రానికి అశోక్ చౌబే దర్శకత్వం వహించారు. గీత గోవిందం (2018) : తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఈ సమస్య నుంచి తప్పించుకోలేకపోయింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన 'గీత గోవిందం'లోని కొన్ని భాగాల డిజిటల్ కాపీ కూడా లీక్ కావడం విశేషం. టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ (2017): 2017 ఆగస్టు 11న విడుదల చేయాలని భావించిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్ నటించారు. అయితే విడుదలకు ముందే సినిమా ఆన్‌లైన్‌లో కనిపించింది.
వివరాలు
ఆ లిస్టులో పవన్ మూవీ కూడా..
అత్తారింటికి దారేది (2013): పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించినప్పటికీ, విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయింది. అప్పట్లో డీవీడీలు, పెన్‌డ్రైవ్‌ల ద్వారా కాపీలు విక్రయించడం పెద్ద సంచలనం సృష్టించింది. ప్రేమమ్ (2015) : నివిన్ పౌలి, సాయి పల్లవి నటించిన 'ప్రేమమ్' కూడా లీక్ సమస్యను ఎదుర్కొంది. విడుదలకు ఒక రోజు ముందు ఈ సినిమా ఫైనల్ కాపీకి చెందిన కీలక సన్నివేశాలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. విశ్వరూపం (2013): విడుదలకు ముందే వివాదాలతో వార్తల్లో నిలిచిన 'విశ్వరూపం' సినిమా కూడా లీక్ సమస్యను ఎదుర్కొంది. కమల్ హాసన్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం పలు వాయిదాల తర్వాత విడుదలైంది.
వివరాలు
మెగాస్టార్ మూవీకి లీకుల బెడద..
టాక్సీవాలా (2018) : విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే పూర్తి రూపంలో లీక్ అయింది. దీంతో విడుదలను వాయిదా వేసిన చిత్రబృందం, వీఎఫ్‌ఎక్స్ మెరుగులు దిద్ది తర్వాత విడుదల చేయగా మంచి స్పందన లభించింది. శంకర్‌దాదా ఎంబీబీఎస్ (2004) : ఇంటర్నెట్ విస్తృతంగా లేని కాలంలోనే 'శంకర్‌దాదా ఎంబీబీఎస్' సినిమా కొన్ని సన్నివేశాలు లీక్ కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. చిరంజీవి నటించిన ఈ చిత్రంలోని భాగాలను సీడీల ద్వారా కాపీ చేసి బయటకు పంపడం అప్పట్లో సంచలనం కలిగించింది.