
Kamal Haasan: ఆస్కార్ అకాడమీలో కమల్ హాసన్,ఆయుష్మాన్ ఖురానాకు చోటు..
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ నటులు కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానా గ్లోబల్ క్లబ్‌లో భాగమయ్యారు. వీరిద్దరికీ ఆస్కార్ అకాడమీ సభ్యత్వానికి ఆహ్వానం లభించడంతో ప్రపంచ స్థాయిలో గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. హాలీవుడ్‌లోని ప్రముఖ నటీనటుల సరసన ఈ ఇద్దరు భారతీయ నటులు కూడా ఇకపై ఆస్కార్ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. ఈ ఏడాది ఆస్కార్ అకాడమీకి కొత్తగా ఎంపికైన సభ్యుల జాబితాను'ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్'తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానా మాత్రమే కాకుండా, ప్రముఖ భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా,ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసు కూడా చోటు దక్కించుకున్నారు. ఆస్కార్ నామినేషన్లలో తుది ఎంపిక చేసే ప్రక్రియలో వీరికి ఓటు హక్కు లభించనుంది.
వివరాలు
41 శాతం మంది మహిళలు
అకాడమీ ఈ ఏడాది మొత్తం 534 మందికి సభ్యత్వ ఆహ్వానం పంపినట్లు ప్రకటించింది. మేధావులైన ఈ ప్రతిభావంతులకు తమ సంస్థలో స్థానం కల్పించడంపై హర్షం వ్యక్తం చేసింది. మొత్తం 19 విభాగాలకు చెందిన నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు ఈ కొత్త జాబితాలో ఉన్నారు. కొత్తగా ఆహ్వానం పొందిన వారిలో 41 శాతం మంది మహిళలు ఉన్నారని అకాడమీ వెల్లడించింది. ఇక వచ్చే సంవత్సరం మార్చి 15న ఆస్కార్ అవార్డు వేడుక జరగనుంది. జనవరి 12 నుండి 16 మధ్య నామినేషన్ ప్రక్రియ నిర్వహించనుండగా, వాటి పరిశీలన అనంతరం తుది నామినేషన్‌ల జాబితాను జనవరి 22న ప్రకటించనున్నారు.