VishwakSen : ప్రేమికుల దినోత్సవ కానుకగా 'లైలా' విడుదల.. మేకర్స్ అనౌన్స్‌మెంట్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ యంగ్ హీరో, మరో విభిన్న ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం విశ్వక్ 'లైలా' అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ మొదటిసారిగా లేడీ గెట్‌అప్‌లో కనిపించనున్నాడు. మెకానిక్ రాకీ సినిమాకు సంబంధించి ప్రమోషన్ పనుల కారణంగా లైలా ప్రాజెక్ట్‌ను కొంతకాలం పక్కన పెట్టిన విశ్వక్, ఇటీవల మళ్లీ ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకువచ్చాడు.
నూతన సంవత్సరం కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్
తాజాగా లైలాకు సంబంధించిన కీలక అప్డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు తెలియజేశారు. అంతేకాదు, జనవరి 1న నూతన సంవత్సర కానుకగా, లేడీ గెట్‌అప్‌లో ఉన్న విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ లుక్ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచుతుందని చిత్రయూనిట్ భావిస్తోంది. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.