
Manisha Koirala: నేపాల్ కు చీకటిరోజు.. హింసపై మనీషా కోయిరాలా తీవ్ర ఆవేదన
ఈ వార్తాకథనం ఏంటి
పొరుగు దేశం నేపాల్‌లో రాజకీయ పరిస్థితులు తీవ్ర సంక్షోభానికి చేరాయి. ఇటీవల ప్రభుత్వం సోషల్ మీడియా వేదికలపై నిషేధం విధించడంతో వ్యతిరేక నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ నిరసనలు ఒక్కసారిగా హింసాత్మక రూపాన్ని తీసుకోవడంతో దేశంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, ఆయన దుబాయ్‌లో ఆశ్రయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం వచ్చింది.
వివరాలు
హింసాత్మకంగా మారిన ఆందోళనలు
ప్రభుత్వం ఫేస్ బుక్, వాట్సాప్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై భద్రతా కారణాలతో నిషేధం విధించడంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. దీనికి ప్రభుత్వ అవినీతి కూడా తోడవడంతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలు అనతికాలంలోనే హింసాత్మకంగా మారి.. మంగళవారం ఉదయం నిరసనకారులు పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించి నిప్పుపెట్టడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ఈ ఘర్షణల్లో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. తన సొంత దేశంలో జరుగుతున్న హింసపై ప్రముఖ బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాలు
నేపాల్ కు చీకటిరోజు అన్న మనీషా కొయిరాలా
ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రక్తపు మరకలతో ఒక బూట్ ఫోటోను షేర్ చేసి, "ఇది కేవలం ఒక ఫోటో కాదు, నేపాల్‌లో జరుగుతున్న హింసకు ప్రత్యక్ష సాక్ష్యం. పరిస్థితి అత్యంత భయంకరంగా ఉంది" అని తన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, నేపాలీ భాషలో పెట్టిన మరో పోస్టులో: "నేపాల్‌లో ఇది చీకటి రోజు. అవినీతికి వ్యతిరేకంగా న్యాయం కోసం గొంతెత్తిన ప్రజలకు బుల్లెట్లు సమాధానం ఇచ్చిన రోజు ఇది" అని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పరిస్థితిని నియంత్రించేందుకు రాజధాని ఖాట్మండూ,లలిత్‌పూర్, పోఖారా, బుత్వాల్ వంటి ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించినప్పటికీ, నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. ప్రధాని రాజీనామా చేసిన తర్వాత కూడా దేశంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.