ప్రభాస్, మహేష్ నాకంటే పెద్ద హీరోలు: ఒప్పుకోవడానికి ఈగో లేదంటున్న పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారాహి విజయ యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ముమ్ముడివరం చేరుకున్న పవన్ కళ్యాణ్, సినిమా హీరోల గురించి మాట్లాడాడు. మా హీరో అంటే మా హీరో గొప్ప అంటూ తన అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గొడవ పడుతుంటారని పవన్ కళ్యాణ్ తో ఎవరో అన్నారట. ఆ విషయమై మాట్లాడిన పవన్ కళ్యాణ్, సినిమా వేరు, రాజకీయం వేరనీ, సినిమా అనేది వినోదం, ఆనందం కోసమని, రాజకీయం అలా కాదని అన్నాడు. తాను ప్రతీ హీరోతో మాట్లాడతాననీ, అందరితో సరదాగా ఉంటాననీ, అందరి సినిమాలు చూస్తానని, తమ మధ్య అలాంటి విభేధాలు లేవని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లపై పవన్ ప్రశంసలు
అంతేకాదు, ప్రభాస్, మహేష్ బాబులు తనకంటే పెద్ద స్టార్లనీ, తన కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారనీ, వాళ్ళు తనకంటే స్టార్లని ఒప్పుకుంటానని, అందులో ఈగో ఏమీ లేదని పవన్ అన్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్స్ అయ్యారనీ, వాళ్ళను ప్రపంచమంతా గుర్తిస్తుందని, నేనలా కాదనీ, సినిమాల్లో ఏ హీరోపైన అభిమానం ఉన్నా కూడా, రాజకీయం దగ్గరికి వచ్చేసరికి తాను చెప్పేది ఒకసారి వినాలని పవన్ కళ్యాణ్ కోరారు. ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇక పవన్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఓజీ, బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.