
Samantha: కొండా సురేఖ వివాదంపై మరోసారి స్పందించిన సమంత
ఈ వార్తాకథనం ఏంటి
సమంత- నాగ చైతన్యల విడాకులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి.
వారిద్దరూ విడిపోవడానికి కారణం మాజీ మంత్రి కేటీఆర్ అని ఆమె వ్యాఖ్యానించడమే ఈ వివాదానికి కారణమైంది.
తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు మహిళా తారల జీవితాలను కేటీఆర్ నాశనం చేశారని కొండా సురేఖ ఆరోపించడం కూడా సంచలనం రేపింది.
ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లోని టాప్ హీరోలు సమంత, అక్కినేని కుటుంబానికి అండగా నిలిచారు.
మంత్రి చేసిన ఆరోపణలపై వారు తీవ్రంగా స్పందించారు. ఈ విషయం గురించి సమంత ఒక ఇంటర్వ్యూలో మరోసారి స్పందించారు.
వివరాలు
ఇండస్ట్రీ నాకు సాయం చేయకుండా ఉండుంటే..
కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ సౌత్ ఇండియాలోని సినీ నటీనటులు చాలామంది సమంతకు మద్దతు తెలిపారు.
ఈ క్రమంలో నెటిజన్లు, ఆమె అభిమానులు కూడా మద్దతిచ్చారు.
అయితే, తనకు అండగా నిలిచిన వారిని గురించి సమంత ఈ విధంగా పేర్కొన్నారు: 'నా గురించి ద్వేష పూరితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ నా పక్షాన నిలబడింది. వారు నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నానంటే, దానికి కారణం ఇండస్ట్రీతో పాటు ఈ ప్రజలు నన్ను వదులుకోకపోవడమే.
వారి ప్రేమ,నాపై ఉన్న విశ్వాసమే ఈ వివాదం నుంచి త్వరగా బయటకు వచ్చేలా చేసింది.
ఇండస్ట్రీ నాకు సాయం చేయకుండా ఉండుంటే, దీని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టేది.
వివరాలు
న్యాయ పోరాటం చేస్తున్నఅక్కినేని నాగార్జున
ఇలాంటి సమయంలో వారే లేకుంటే, నేను మరింతగా కుంగిపోయేదాన్ని. అందరి సపోర్ట్ వల్లే మళ్లీ నేను ఇక్కడ తిరిగి మీ ముందు కూర్చున్నాను.' అని సమంత ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, మాజీ మంత్రి ఆర్కే రోజా తదితరులు స్పందించారు.
ఆమె చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.