Page Loader
Rohith Vemula Bill: ₹1 లక్ష జరిమానా,3 సంవత్సరాల జైలు శిక్ష: రోహిత్ వేముల బిల్లు సిద్ధం చేసిన కర్ణాటక ప్రభుత్వం
1 లక్ష జరిమానా,3 సంవత్సరాల జైలు శిక్ష: రోహిత్ వేముల బిల్లు సిద్ధం చేసిన కర్ణాటక ప్రభుత్వం

Rohith Vemula Bill: ₹1 లక్ష జరిమానా,3 సంవత్సరాల జైలు శిక్ష: రోహిత్ వేముల బిల్లు సిద్ధం చేసిన కర్ణాటక ప్రభుత్వం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2025
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇచ్చిన సూచనల మేరకు, ఆ రాష్ట్ర ప్రభుత్వం రోహిత్ వేముల పేరుతో ఒక ప్రత్యేక బిల్లును రూపొందించింది. ఈ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రోహిత్ వేముల పేరుతో రూపొందించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ వేముల కుల వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి, రోహిత్ వేముల (మినహాయింపు లేదా అన్యాయం నివారణ) (విద్య, గౌరవ హక్కు) బిల్లు-2025 పేరుతో కర్ణాటక ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులపై వివక్షను అరికట్టడమే లక్ష్యంగా ఈ బిల్లు రూపొందించామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

వివరాలు 

రోహిత్ వేముల బిల్లులో ముఖ్యమైన అంశాలు ఇవే: 

షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), ఇతర వెనుకబడిన తరగతులు (OBC), మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులపై సామాజిక,ఆర్థిక,మత ఆధారంగా బహిష్కరణ, అన్యాయం జరగకుండా నివారించడమే ఈ బిల్లుని ప్రధాన ఉద్దేశ్యం. SC/ST విద్యార్థులను ప్రవేశానికి నిరాకరించడం, వారి నుండి డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వబడ్డ హామీలను అమలు చేయకుండా చేయడం లాంటి చర్యలను ఈ బిల్లు నిషేధిస్తుంది. పై వర్గాల విద్యార్థులపై జరిగిన వివక్షా చర్యలకు సంబంధించి నేరాలపై బెయిల్ లేని కేసులు నమోదయ్యేలా చట్టాన్ని రూపొందించారు. వివక్షను కలిగించిన వ్యక్తి మాత్రమే కాకుండా, ఆ చర్యకు సహకరించిన వారిపై కూడా శిక్షలు విధించేలా చట్టాన్ని రూపొందించారు.

వివరాలు 

రోహిత్ వేముల బిల్లులో ముఖ్యమైన అంశాలు ఇవే: 

ఈ నేరాల విచారణ వేగంగా జరిగేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నట్టు బిల్లులో పేర్కొన్నారు. ప్రతి ప్రత్యేక కోర్టులో కనీసం ఒక ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను, హైకోర్టు బెంచ్‌కి ఒకరిని నియమించే విధంగా వీలుకల్పించేలా బిల్లును రూపొందించారు. ఈ బిల్లు చట్టంగా మారిన తరువాత, నిందితుడిపై మొదటి నేరం రుజువైతే ఏడాది జైలుశిక్షతో పాటు ₹10,000 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. బాధిత విద్యార్థికి ₹1 లక్ష వరకు పరిహారం చెల్లించాలనే ఆదేశాలు ఇవ్వవచ్చు. అదే నిందితుడు మరొకసారి ఇదే నేరాన్ని చేయడంలాంటిది రుజువైతే, అతనికి 3 సంవత్సరాల జైలుశిక్షతో పాటు ₹1 లక్ష జరిమానా విధించేలా చట్టం ప్రవేశపెడతారు.

వివరాలు 

రోహిత్ వేముల బిల్లులో ముఖ్యమైన అంశాలు ఇవే: 

ఏ విద్యాసంస్థ అయినా అన్ని కులాలు, మతాలు, లింగం, జాతి అనే తేడా లేకుండా విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాల్సిందే. దీనిని ఉల్లంఘిస్తే ఆ సంస్థపై కూడా ఈ చట్టం కింద శిక్షలు విధించేలా నిబంధనలు చేర్చారు. ఈ బిల్లు చట్టంగా మారిన తరువాత నిబంధనలను ఉల్లంఘించే విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహాయం లేదా గ్రాంట్‌లు ఇవ్వకుండా నిషేధం విధించనుంది. ఏప్రిల్‌లో రాహుల్ గాంధీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాసి, ఉన్నత విద్యాసంస్థల్లో కుల ఆధారిత వివక్షను నివారించేందుకు రోహిత్ వేముల పేరుతో చట్టం తీసుకురావాలని సూచించారు. దీనికి స్పందనగా సీఎం సిద్ధరామయ్య, విద్యా సంస్థల్లో అణగారిన వర్గాల విద్యార్థులు వివక్షను ఎదుర్కొనకుండా కట్టుబడి ఉన్నామని చెప్పారు.

వివరాలు 

రోహిత్ వేముల బిల్లులో ముఖ్యమైన అంశాలు ఇవే: 

కాంగ్రెస్ పార్టీ 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో రోహిత్ వేముల బిల్లును ప్రవేశపెట్టే విషయాన్ని పేర్కొంది. ఇప్పుడు ఆ ప్రకటనను కార్యరూపం దాల్చించేందుకు నేతలు ప్రయత్నాలు చేపట్టారు. త్వరలో అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది.