ఒడిశా రైలు విషాదం: ఇంకా గుర్తించని 101 మృతదేహాలు
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 275 మంది ప్రాణాలు కోల్పోగా, 1100 మందికి పైగా గాయపడ్డారు. అయితే మరణించిన వారిలో ఇంకా 101 మృతదేహాలను గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఒడిశాలోని వివిధ ఆసుపత్రుల్లో ఇంకా 200 మంది చికిత్స పొందుతున్నారని తూర్పు మధ్య రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ రింకేశ్ రాయ్ వెల్లడించారు. గాయపడిన వారిలో 900 మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. బాలాసోర్‌లో రెండు ప్యాసింజర్ రైళ్లు, ఒక గూడ్స్ రైలు ఢీకొన్న విధ్వంసకర ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
55 బాడీలు బంధువులకు అప్పగింత
భువనేశ్వర్‌లో ఉంచిన మొత్తం 193 మృతదేహాల్లో 80వరకు బాడీలను గుర్తించారని, 55 బంధువులకు అప్పగించారని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయ్ అమృత్ కులంగే అన్నారు. బీఎంసీ హెల్ప్‌లైన్ నంబర్‌కు 200 కంటే ఎక్కువ కాల్‌లు వచ్చాయని, మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం బాలాసోర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా పరామర్శించారు.