TGSRTC: భారీ వర్షాల నేపథ్యంలో.. తెలంగాణలో 1400 బస్సులు రద్దు
భారీ వర్షాల కారణంగా టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో బస్సులు రద్దు చేశారు. ఆదివారం రాత్రి వరకు 877 బస్సులను రద్దు చేయగా, సోమవారం ఉదయం నుంచి మరో 570 బస్సులను రద్దు చేశారు. ముఖ్యంగా మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ వంటి ప్రాంతాలకు వెళ్లే బస్సులను పూర్తిగా నిలిపివేశారు. నేడు(మంగళవారం) కూడా ఆ మార్గాలపై రోడ్లు జలమయం కావడంతో, ఆర్టీసీ అధికారులు బస్సులను రద్దు చేసినట్లు తెలిపారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో 1400కు పైగా బస్సులు రద్దు అయ్యాయి. వరద పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాతే బస్సులు తిరిగి నడుస్తాయని అధికారులు వెల్లడించారు.
వికారాబాద్ జిల్లాలో 212 బస్సుల బదులు కేవలం 50 బస్సులు
మరికొన్ని బస్సులను దారి మళ్లించి,హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేవాటిని గుంటూరు మీదుగా వేరే మార్గంలో సాగనంపారు. ఖమ్మం జిల్లాలో మాత్రం బస్సులు యథావిధిగా కొనసాగుతున్నాయి. రంగారెడ్డి ఆర్‌ఎం శ్రీలత మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాలో 212 బస్సుల బదులు కేవలం 50 బస్సులు మాత్రమే ముంపునకు గురయ్యాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన వరదల కారణంగా పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నీటిలో చిక్కుకున్నాయి, కానీ అధికారులు ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ
వరదల ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఆర్టీసీ సర్వీసులు రద్దు చేశారు. వాయుగుండం తీరం దాటిన తర్వాత, అది 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రాబోయే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు పడే సూచనలతో, తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.