
Omar Abdullah: పాక్ దాడుల్లో 20మంది పౌరుల మృతి.. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు నష్టపరిహారం
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ దాడులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా పాకిస్థాన్ జరిపిన కాల్పులు, డ్రోన్ దాడుల్లో దాదాపు 20 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో ప్రభుత్వ అధికారి రాజ్‌కుమార్ థప్పా కూడా ఉండగా, పలువురు గాయపడ్డారు.
ఈ దాడులకు ప్రతిస్పందనగా జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులకు కౌంటర్‌గా పాక్ దాడులు మళ్లీ చెలరేగాయి.
Details
శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో భారీ పేలుడు
నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కనబెట్టి వరుసగా దాడులు చేస్తోంది.
శ్రీనగర్, రాజౌరి, పూంఛ్, పఠాన్ కోట్ వంటి ప్రాంతాల్లో పాక్ డ్రోన్‌లు బాంబులు వేస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున కూడా పాక్ సైన్యం దాడులకు పాల్పడింది.
బాంబు పేలుళ్ల నేపథ్యంలో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాకౌట్ అమలు చేశారు.
ఉదయం పఠాన్ కోట్, శ్రీనగర్ ప్రాంతాల్లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు.
మధ్యాహ్నం 11 గంటల సమయంలో శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో భారీ పేలుడు శబ్దం విన్నట్లు అధికారులు వెల్లడించారు.
Details
భద్రతా ఏర్పాట్లు ముమ్మరం
భారత్ సైన్యం పాక్ దాడులకు సమర్థవంతంగా కౌంటర్ ఇస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది.
సైనికులు సైరన్లు మోగించి ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు.
ఈ మేరకు ప్రతి ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు సమాచారం.
ఇలాంటి ఘటనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. పౌరుల ప్రాణాలు కోల్పోవడం, ప్రభుత్వ అధికారులే లక్ష్యంగా మారడం తీవ్ర విషాదానికి దారితీసింది.