YSRCP vs Janasena: ఒంగోలులో వైసీపీకి గట్టి షాక్.. జనసేనలోకి 20 మంది కార్పొరేటర్లు, ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులు..
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఒంగోలులో వైసీపీకి మరో పెద్ద షాక్ ఎదురుకానుంది.
వైసీపీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల జనసేనలో చేరారు.
ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం జనసేన అధినేత,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు,కో-ఆప్షన్ సభ్యులు జనసేనలో చేరనున్నారు.
మొత్తం 20 మంది వైసీపీ కార్పొరేటర్లు,ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.
గత కొంతకాలంగా ఈ కార్పొరేటర్లు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతూనే ఉన్నప్పటికీ,పవన్ అందుబాటులో లేకపోవడంతో ఈ కార్యక్రమం పలుమార్లు వాయిదా పడిందని సమాచారం.
వివరాలు
జనసేన వైపు అడుగులు
గతంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నేతగా ఉన్న సమయంలో ఆయన మద్దతుతోనే అనేక మంది కార్పొరేటర్లు విజయం సాధించారు.
కానీ,ఇప్పుడు ఆయన వైసీపీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరిన నేపథ్యంలో, ఆయన అనుచరులంతా జనసేన వైపు అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే ఒంగోలు కార్పొరేషన్ టీడీపీ ఆధీనంలోకి వెళ్లిపోయింది.ఇప్పుడు మరో 23 మంది సభ్యులు జనసేనలో చేరితే, ఒంగోలు కార్పొరేషన్‌లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ మార్పును అడ్డుకోవడానికి టీడీపీ కూడా ప్రయత్నించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మొత్తంగా, వైసీపీకి షాక్ ఇస్తూ,ఈ రోజు ఒంగోలు కార్పొరేటర్లు జనసేన కండువా కప్పుకోవడానికి సిద్ధం అయ్యారు ఒంగోలు కార్పొరేటర్లు.