Bihar: 225+ సీట్లు టార్గెట్.. బీహార్‌లో విజయానికి బీజేపీ మాస్టర్ ప్లాన్!
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉంది. హర్యానా, మహారాష్ట్ర, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ భారీ విజయం సాధించింది.
ఈ నూతనోత్సాహంతో బీహార్‌లోనూ అదే జోరు కొనసాగించాలని కమలనాథులు సంకల్పించారు.
అక్టోబర్ లేదా నవంబర్‌లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా జేడీయూ-బీజేపీ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది.
సాధారణంగా దీర్ఘకాలం అధికారంలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది.
అయితే దిల్లీలో పదేళ్ల పాలన అనంతరం బీజేపీ వ్యతిరేకతను తమ అనుకూలంగా మార్చుకుని విజయం సాధించిందని, అదే తరహాలో బీహార్‌లోనూ వ్యూహాలు రచించాలని భావిస్తోంది.
Details
తేజస్వీ యాదవ్‌కు అవకాశం ఇచ్చేది లేదు
బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ ఎలాగైనా 225 సీట్లు గెలిచి అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
నితీష్ కుమార్‌తో కలిసి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వ్యూహాలను రూపొందిస్తోంది.
ఇదే సమయంలో ఆర్జేడీ ప్రభుత్వం వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.
అయితే ఆ అవకాశాన్ని తేజస్వీ యాదవ్‌కు ఇవ్వకుండా ముందుగా తాము వ్యతిరేకతను తిప్పికొట్టాలని బీజేపీ భావిస్తోంది.
సీట్ల పంపకాలపై వ్యూహం
సీట్ల పంపకాల విషయంలో ఎలాంటి అంతరాయం రాకుండా జేడీయూతో వ్యూహాత్మకంగా చర్చలు జరపాలని బీజేపీ భావిస్తోంది.
అయితే జేడీయూ ఎక్కువ సీట్లను డిమాండ్ చేయనుందని అంచనా. దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.
Details
74 సీట్లను గెలుచుకున్న బీజేపీ
2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 115 స్థానాల్లో పోటీ చేసి కేవలం 43 సీట్లను మాత్రమే గెలుచుకుంది.
బీజేపీ పోటీ చేసిన 110 స్థానాల్లో 74 సీట్లను కైవసం చేసుకుంది.
అయితే తక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా కొనసాగడం గమనార్హం. మధ్యలో ఆర్జేడీతో నితీష్ కుమార్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, కొద్ది రోజుల్లోనే తిరిగి బీజేపీతో చేతులు కలిపారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ-జేడీయూ కూటమి అధిక పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది.
ఇప్పుడీ ఎన్నికల్లోనూ అదే విజయాన్ని సాధించి తిరిగి బీహార్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.