AP News: మూడేళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు.. 'జలజీవన్ మిషన్'పై సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం
2027 నాటికి గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా సురక్షిత నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ లక్ష్యానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులు కోరారు. రాష్ట్రంలో జలజీవన్ మిషన్ పథకం అమలుపై గురువారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్ష జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని చంద్రబాబు ఆరోపించారు. కేంద్రం కేటాయించిన రూ.27,248 కోట్లలో కేవలం రూ.4,235 కోట్లే ఖర్చు చేశారని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రం నుండి నిధులు అందించని కారణంగా పనులు ముందుకు సాగలేదని ఆయన అన్నారు.
తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు
2019కి ముందు పలు గ్రామాలలో కుళాయిలు ఏర్పాటు చేసి, ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని అందించామని.. ఆ తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు' అని చంద్రబాబు మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలు ఈ పథకాన్ని బాగా వినియోగిస్తున్నాయనే ముఖ్యమంత్రి తెలిపారు. అయితే, మన రాష్ట్రంలో 28 లక్షల ఇళ్లకు ఇంకా కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. "గ్రామాల్లో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనాలి" అని చంద్రబాబు అన్నారు. సమీప రిజర్వాయర్ల నుండి పైపులైన్లు వేసి గ్రామాలకు నిరంతరంగా తాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నీటి లభ్యత, వినియోగంపై జలవనరుల శాఖ అధికారులతో సమన్వయం చేయాలని ఆయన పేర్కొన్నారు.
28 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు
28 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు అందించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలన్నారు. అత్యున్నతస్థాయి కన్సల్టెంట్లను భాగస్వాములుగా చేర్చాలని ఆయన సూచించారు. సురక్షిత నీటితో పాటు వేగంగా సరఫరా అందించేందుకు ఆధునిక సాంకేతికతలను ఉపయోగించాలని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల జలజీవన్ మిషన్ అమలులో జాప్యం జరిగిందని, వాటిని సరిదిద్ది నిధులు అందించడానికి కేంద్రాన్ని ఒప్పిస్తామని ఆయన అన్నారు. పురోగతి లేని పనుల టెండర్లు రద్దు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న పనులను గుత్తేదారులతో పూర్తి చేయించి, మెటీరియల్ వినియోగంపై ఇంజినీర్లు నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు. మూడు నెలల్లో పనులు ముందుకు సాగాలని ఆయన చెప్పారు.