
'one nation, one election': 'ఒకే దేశం, ఒకే ఎన్నిక'కు అనుకూలంగా 269 మంది ఎంపీలు ఓటు
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' ప్రణాళికకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందు 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు మరో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టింది.
ఈ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ వంటి రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించగా, ఎన్డీయే మిత్రపక్షాలు పూర్తి మద్దతు ప్రకటించాయి.
అనంతరం బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా, 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా 198 మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు.
వివరాలు
ప్రతిపక్ష నేతలు ఈ బిల్లుపై తీవ్ర విమర్శలు
ఈ సందర్భంగా టీడీపీ భేషరతుగా బిల్లుకు మద్దతు ప్రకటించింది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, జమిలి ఎన్నికల వల్ల ఖర్చులు తగ్గి సామర్థ్యం పెరిగి, అభివృద్ధికి ఆటంకం తొలగుతుందని తెలిపారు.
పోలింగ్ శాతం మెరుగుపడటంతో పాటు, తరచూ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఏర్పడుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వివరించారు.
ఇదే సమయంలో ప్రతిపక్ష నేతలు ఈ బిల్లుపై తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ దీన్ని రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని పేర్కొనగా, ఎస్పీ నేత ధర్మేంద్ర యాదవ్ జమిలి ఎన్నికల వల్ల నియంతృత్వానికి తలుపులు తెరుచుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వివరాలు
జమిలి ఎన్నికలు ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తాయి: అసదుద్దీన్ ఓవైసీ
టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ రాష్ట్రాల హక్కులు దెబ్బతినడంతో పాటు ఇది ప్రజాస్వామ్యానికి వైరస్‌గా మారుతుందని విమర్శించారు.
మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇదే ఉద్దేశంతో, జమిలి ఎన్నికలు ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తాయని చెప్పారు.
మరోవైపు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే బిల్లును జేపీసీకి పంపించాలని డిమాండ్ చేశారు.
కేంద్రానికి అనుకూలంగా ఉన్న శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే ప్రతిపక్షాలు సంస్కరణలకు వ్యతిరేకంగా ఉంటాయని విమర్శించారు.
వివరాలు
బిల్లును జేపీసీకి పంపడంపై అభ్యంతరం లేదు: అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా బిల్లును జేపీసీకి పంపడంపై అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
బిల్లు ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ మాట్లాడుతూ, ఇది కొత్త విషయం కాదని, 1983 నుంచే ఈ విధానానికి డిమాండ్ ఉందని తెలిపారు.
స్వీడన్, జర్మనీ వంటి దేశాల్లో ఇదే విధమైన ఎన్నికలు జరిగాయని, జమిలి ఎన్నికల వల్ల రాజ్యాంగానికి భంగం కలగదని, ప్రతిపక్షాలు రాజకీయ కోణంలో వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు.