Gujarat: గుజరాత్ నలుగురు ISIS ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఏటీఎస్
గుజరాత్, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. నలుగురు ఉగ్రవాదులు శ్రీలంక పౌరులే. గుజరాత్ ఏటీఎస్ ప్రస్తుతం నలుగురు ఉగ్రవాదులను గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లి విచారణ ప్రారంభించింది. అహ్మదాబాద్ విమానాశ్రయానికి ఉగ్రవాదులు ఏ ఉద్దేశంతో వచ్చారన్న సమాచారం ఇంకా తెలియరాలేదు. ఇంతకు ముందు కూడా గుజరాత్ ఏటీఎస్ సీక్రెట్ ఆపరేషన్‌లో ఐఎస్ ఖొరాసన్‌తో సంబంధం ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆఫ్ఘనిస్థాన్ వెళ్లి అక్కడి నుంచి పోర్ బందర్ సముద్ర మార్గం గుండా ఇరాన్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు గుజరాత్ ఏటీఎస్ కు సమాచారం అందింది.
దేశంలో భారీ ఉగ్రదాడి చేసేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు
సమాచారం ఆధారంగా, గుజరాత్ ATS పోర్‌బందర్‌లో దాడి చేసి, శ్రీనగర్‌కు చెందిన ఉమైద్ మీర్, హనన్ షోల్, మహ్మద్ హజీమ్ అనే ముగ్గురు అనుమానితులను పోర్‌బందర్ రైల్వే స్టేషన్ నుండి అరెస్టు చేసి, ISIS ఇండియా మాడ్యూల్‌ను ఛేదించింది. మూలాల ప్రకారం, ఈ నలుగురు ఉగ్రవాదులు దేశంలో భారీ ఉగ్రదాడి చేయడానికి ప్లాన్ చేశారు. ఈ ఉగ్రవాదులు శ్రీలంక నుంచి చెన్నై మీదుగా అహ్మదాబాద్ చేరుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నలుగురు ఉగ్రవాదులు నిర్దేశిత ప్రదేశానికి చేరుకోకముందే గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. ఈ ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి తమ హ్యాండ్లర్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారని కూడా తెలిసింది. ఈ ఉగ్రవాదులు అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత, గుజరాత్ పోలీసులు అప్రమత్తమయ్యారు.