Prahlad Joshi: 2030 నాటికి 500 GW పునరుత్పాదక ఇంధనమే లక్ష్యం
భారతదేశంలో 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు రూ.30 లక్షల కోట్లు అవసరమని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, పునరుత్పాదక శక్తి రంగంలో పెట్టుబడులు అవసరమని ఆయన స్పష్టం చేశారు. పునరుత్పాదక శక్తి కోసం నాల్గవ రీ-ఇన్వెస్ట్ 2024 కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. ఈ గ్లోబల్ సమ్మిట్ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ సదస్సు జరుగనుంది.
గతంలో మూడు రీ-ఇన్వెస్ట్ సదస్సులు
గతంలో మూడు రీ-ఇన్వెస్ట్ సదస్సులు నిర్వహించామని, అందులో ఒకటి వర్చువల్ మోడ్‌లో, రెండు ఢిల్లీ నగరంలో జరిగాయని జోషి చెప్పారు. ఈసారి గుజరాత్‌లో నిర్వహించే మొదటి సదస్సు కావడంతో, వైబ్రెంట్ గుజరాత్‌ను నమ్మి, ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి స్థాయి సర్వసభ్య సమావేశం, సీఈవో రౌండ్‌టేబుల్, సాంకేతిక సెషన్‌లు తదితర 40 సెషన్‌లు ఉంటాయని చెప్పారు. రీ-ఇన్వెస్ట్ 2024 ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రతి అంశాన్ని కలుపుతున్న వేదికగా గుర్తింపు పొందింది. ఇందులో ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల ప్రముఖులు, పెట్టుబడిదారులు, పరిశోధకులు, విధాన రూపకర్తలు పాల్గొననున్నారు.