Page Loader
శవాల దిబ్బగా మారిన ఉత్తరాది.. హిమాచల్, ఉత్తరాఖండ్ వరదల్లో 81కి చేరిన మృతులు
హిమాచల్, ఉత్తరాఖండ్ వరదల్లో 81కి చేరిన మృతులు

శవాల దిబ్బగా మారిన ఉత్తరాది.. హిమాచల్, ఉత్తరాఖండ్ వరదల్లో 81కి చేరిన మృతులు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 17, 2023
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

భారీ వరదలు ఉత్తరాది రాష్ట్రాలను శవాల దిబ్బగా మార్చుతున్నాయి. ఈ మేరకు భారీ ప్రాణ నష్టం సంభవించింది. గత కొద్ది రోజులగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో దాదాపుగా 81 మంది మరణించారు. ఈ క్రమంలోనే చాలా చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్లు కూలి చనిపోవడంతో,ఆయా మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో కాంగ్రా జిల్లాలోని ఇండోరా,ఫతేపూర్ సబ్ డివిజన్లలో 1,731 మందిని కాపాడినట్లు డిప్యూటీ కమిషనర్ నిపున్ జిందాల్ వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి హెలికాప్టర్లు, ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్ తో ప్రజలను తరలిస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది.

DETAILS

పంజాబ్ కు తాకిన వరద ముప్పు

హిమాచల్‌లో ఈసారి రుతుపవనాలు వచ్చిన తర్వాత 54 రోజుల్లోనే 742 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. మరోవైపు సోమవారం కొండచరియలు విరిగిపడి ఉత్తరాఖండ్‌లోని లక్ష్మణ్ ఝూలాలోని రిసార్ట్‌లో శిథిలాల నుంచి మొత్తం 4 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం అర్థరాత్రి మరో 2 మృతదేహాలు, బుధవారం ఇంకో 2 మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. తాజాగా నాలుగు మృతదేహాలను వెలికితీయడంతో ఉత్తరాఖండ్‌లో మృతుల సంఖ్య 10కి చేరింది. మరోవైపు పాంగ్,భాక్రా డ్యామ్‌ల నుంచి అదనపు నీటి విడుదలతో హోషియార్‌పూర్, గురుదాస్‌పూర్, రూప్‌నగర్ జిల్లాలు నీట మునిగాయి. దీంతో పంజాబ్ రాష్ట్రాన్ని వరదలు చుట్టుముడుతున్నాయి. ఈ మేరకు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు సీఎం భగవంత్ మాన్ పేర్కొన్నారు.