మరోసారి ఉత్తరాదిలో కుంభవృష్టి.. ఒక్క హిమాచల్‌లోనే 51 మంది మృతి
ఉత్తరాది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కుంభవృష్టి కారణంగా భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈమేరకు దాదాపుగా 54 మందికిపైగా ప్రాణం విడిచారు. వందలాది మంది తమ నివాసాలను కోల్పోయారు. వేలాది మంది పునరావాస కేంద్రాలకు తరలిపోయారు. కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారులపై రాకపోకలు స్తంభించాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల ధాటికి మరణించిన 54 మందిలో ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే 51 మంది చనిపోవడం ఆ రాష్ట్రంలోని వరదల తీవ్రతను తెలియజేస్తోంది. హిమాచల్ లోని సిమ్లాలోని సమ్మర్ హిల్ ప్రాంతంలో శివాలయంపై రెండు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనతో 14 మంది భక్తులు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది.సోలాన్‌లో ఒకే కుటుంబంలోని ఏడుగురు వ్యక్తులు మరణించడం గమనార్హం.
రెండు రోజుల పాటు చార్‌ధామ్ యాత్ర నిలిపివేత
హిమాచల్ లోని 9 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రూ. 7,171 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. మరోవైపు భీకర వర్షాల ధాటితి స్వాతంత్ర వేడుకలకు అంతరాయం కలిగింది. వర్షాల తాకిడికి ఉత్తరాఖండ్‌లో ముగ్గురు మరణించారు. మరో 10 మంది గల్లంతయ్యారు. వానలు విజృంభిస్తుండటంతో బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి వెళ్లే రహదారులపై రాకపోకలకు ఆటంకం కలిగింది. దీంతో చార్‌ధామ్ యాత్రను రెండు రోజుల పాటు నిలిపివేశారు.